గ్రీన్ కార్డ్ స్కాం... ఇండియన్ వరుస పెళ్లిల్లు, అసత్యాలు!

వివరాళ్లోకి వెళ్తే... జైప్రకాష్ గుల్వాడీ 2001లో తాత్కాలిక వ్యాపార వీసాపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు.

Update: 2024-02-07 14:30 GMT

అమెరికా పౌరసత్వం (గ్రీన్ కార్డ్) కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అగ్రరాజ్యంలో హాయిగా బ్రతకొచ్చని భావిస్తుంటారు. అయితే అందుకు అసలు దారులు వదిలేసి దొడ్డిదారిని ప్రయత్నించిన ఒక వ్యక్తి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. గ్రీన్ కార్డ్ కోసం ఇతగాడు చేసిన పనులు, చెప్పిన అసత్యాలు వెరసి కటకటాల పాలు తప్పదని అంటున్నారు.

అవును... ఫ్లోరిడాలోని ల్యాండ్ ఓ లేక్స్‌ కు చెందిన జైప్రకాష్ గుల్వాడీ అనే వ్యక్తి అమెరికా పౌరసత్వం కోసం చేసిన పనులు, చెప్పిన అబద్దాలను అంగీకరించాడు. దీంతో... అతను 10 సంవత్సరాల వరకు జైలుకు వెళ్లవచ్చని తెలుస్తుంది. అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసినప్పుడు తన పెళ్లిళ్లు, పిల్లల విషయంలో నిజం చెప్పకపోవడం, అబద్దాలు చెప్పడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... జైప్రకాష్ గుల్వాడీ 2001లో తాత్కాలిక వ్యాపార వీసాపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. అనంతరం అక్కడ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2008లో తన అమెరికన్ భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత, అతను కేవలం రెండు వారాల తర్వాత మరో అమెరికన్ సిటిజన్ ని వివాహం చేసుకున్నాడు. దీంతో ఈ కొత్త వివాహం అతనికి 2009లో చట్టబద్ధమైన శాశ్వత నివాసి కావడానికి సహాయపడింది.

అయినప్పటికీ జైప్రకాష్ గుల్వాడీ అక్కడితో ఆగలేదు. 2009లో భారతదేశానికి తిరిగి వచ్చి.. భారతీయ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2011లో వారికి ఒక బిడ్డ జన్మించింది. ఇలా అటు అమెరికాలో, ఇటు ఇండియాలో రెండుచోట్లా వివాహం చేసుకున్నప్పటికీ.. తనకు వివాహం కాలేదని, పిల్లలు లేరని పేర్కొంటూ 2014లో యుఎస్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Read more!

అనంతరం యూఎస్ పాస్‌ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని.. భారతీయ భార్యను విడిచిపెట్టాడు. ఈ పాస్‌ పోర్ట్‌ తో, అతను అమెరికా, ఇండియా మధ్య చాలాసార్లు అటూ ఇటూ ప్రయాణించాడు. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అతని వ్యవహారాన్ని కనుగొంది. దీంతో... చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందడం, తప్పుడు ప్రకటనలు చేయడం, అబద్ధాల ద్వారా పాస్‌ పోర్ట్‌ ను ఉపయోగించడం వంటి నేరాలను అంగీకరించాడు గుల్వాడీ.

దీంతో... .జైప్రకాష్ గుల్వాడికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... అతని మోసపూరిత ప్రయాణానికి ముగింపు పలుకుతూ యూఎస్ పౌరసత్వం కూడా రద్దు చేయబడుతుందని తెలుస్తుంది.



Tags:    

Similar News