వైసీపీ గెలుపు లెక్క...కిందా పడినా పైచేయి అంటూ !
| స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతుండగా.. వైసీపీ మాత్రం తమ ఓట్ల శాతం పెరిగిందని వాదిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం సీట్లకే పరిమితమైన తమకు, తాజా మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతం వార్డులు, జెడ్పీటీసీల్లో 10 శాతం, ఎంపీటీసీల్లో 20 శాతం సీట్లు వచ్చాయని లెక్కలు చెబుతోంది. గతంతో పోలిస్తే తమ రాజకీయ బలం పెరిగిందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో అడ్డంకులు ఎదురైనా ఈ ఫలితాలు సాధించామని పేర్కొంటున్నారు.
వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లలో పూర్తిగా చతికిలపడిపోయింది అని కూటమి నేతలు గట్టిగానే విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోయిందని విశ్లేషిస్తున్నారు. ఇక కూటమి హవా ఎక్కడ చూసినా వీచడం ఖాయం అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తామే గెలిచామని అంటున్నారు. నైతిక విజయం అంటున్నారు, కూటమి గెలుపు అసలు కానే కాదని తీసి పక్కన పెడుతున్నారు. ఇంతకీ వైసీపీ లెక్కలేమిటి ఎందుకు ఆ విధంగా చెబుతోంది. అందులో లాజిక్ పాయింట్స్ ఏమిటి అంటే వైసీపీకి ఈ ఎన్నికలు అయితే ఎంతో కొంత ఊపు ఇచ్చాయనే అంటున్నారు.
జస్ట్ 11 సీట్లు నుంచి :
వైసీపీ రాజకీయాన్ని కానీ సీట్ల శాతాన్ని కానీ లెక్కించాల్సింది 151 నుంచి కాదు 11 సీట్ల నుంచే అని అంటున్నారు వైసీపీ రాజకీయ విశ్లేషకులు. అలా చూస్తే 175 సీట్లలో ఆ పార్టీ సాధించింది 2024 ఎన్నికల్లో కేవలం 11 మాత్రమే. ఇది 6 శాతం సీటు షేర్ కింద లెక్క. అందుకే కూటమి 94 శాతం సీటు షేర్ తమకు 2024 ఎన్నికల్లో వచ్చింది అని గట్టిగా చెప్పుకుంది. మరి ఇప్పుడు ఇదే తీరున స్థానిక సంస్థల ఎన్నికలను బేరీజు వేసుకుంటే వందకు 5 సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అలాగే 550 దాకా వార్డులు డివిజన్లు గెలిచింది అని లెక్క ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఏపీలో వార్డులు డివిజన్లు ఎన్ని ఉన్నాయంటే 3,942 గా లెక్క తేలుతోంది. ఇందులో వైసీపీ గెలిచిన వార్డులు 550 తీసుకుంటే 12 శాతం ఓటు షేర్ ని ఆ పార్టీ దక్కించుకుంది అన్న మాట. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఆరు శాతం ఓటు షేర్ కి ఇది రెట్టింపుగానే వైసీపీ వారు చూస్తున్నారు. ఆ మేరకు తమ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. అదే సమయంలో కూటమి 88 శాతం సీటు షేర్ తో ఉంది. అంటె 94 శాతం సీటు షేర్ నుంచి వెనక్కి వచ్చినట్లే అన్నది కూడా విశ్లేషిస్తున్నారు.
పరిషత్తు ఎన్నికల్లో :
ఇక పరిషత్తు ఎన్నికలు తీసుకుంటే మొత్తం జెడ్పీటీసీలు ఏపీలో ఎన్ని ఉన్నాయంటే 659 గా లెక్క ఉంది. ఇందులో ఏకగ్రీవమైన స్థానాలు 77 ఉంటే పోలింగ్ జరిగిన స్థానాలు 587. ఇదే ఎన్నికల్లో జెడ్పీటీసీలలో వైసీపీ వాటా దాదాపుగా అరవై దాకా ఉంది. అంటే మొత్తం సీట్లలో పది శాతం వైసీపీ సీటు షేర్ ఉంది అన్న మాట. అలాగే మొత్తం ఎంపీటీసీలు ఏపీలో ఉన్నవి 9,821 అయితే ఇందులో ఏకగ్రీవమైన స్థానాలు 2,051 పోగా పోలింగ్ జరిగిన స్థానాలు: 7,767 గా ఉన్నాయి. ఇందులో నుంచి 1, 606 ఎంపీటీసీలు వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ చూసినా వైసీపీకి 20 శాతం సీటు షేర్ దక్కినట్లు అయింది. దాంతో 2024 లో వైసీపీకి దక్కిన 11 సీట్లు అలాగే ఆరు శాతం సీటు షేర్ లెక్కను మించి తాము ఘన విజయాలు సాధించినట్లే అని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. లాజికల్ గా కూడా ఈ లెక్క సరిపోతోంది అని అంటున్నారు.
నిర్భంధాల నుంచి :
ఇంకో మాట కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది. తమను నామినేషన్ల పర్వం నుంచి ఘర్షణలు చోటు చేసుకున్నాయని తమను ఎక్కడా నామినేషన్లు వేయనివ్వలేదని పోలింగ్ సాఫీగా సాగలేదని కౌంటింగ్ దగ్గర ఇబ్బందులు పెట్టారని వైసీపీ నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులు. ఇలా ఇన్ని నిర్భందాలు పెట్టినా కూటమిగా మూడు పార్టీలు దండెత్తి వచ్చినా అధికారంతో పాటు అంగబలం అర్ధ బలం తోడు అయి దూకుడు చేసినా తాము సాధించిన విజయాలు అపురూపమే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇవే ఎన్నికలు స్వేచ్చగా పెడితే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో రాజకీయం బాగా తెలిసిన వారు ఎవరైనా విశ్లేషణ చేయవచ్చునని కూడా చెబుతున్నారు. మరి ఈ వాదనలను కూటమి ఎలా తీసుకుంటుందో చూడాల్సి ఉంది.