అనూహ్య పొత్తులోకి వైసీపీ...క్యాడర్ ఒత్తిడి ?
ఏపీలో టీడీపీ కూటమి పటిష్టంగా ఉంది. మూడు పార్టీలు కలసి కట్టుగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మేమే గెలుస్తామని కూటమి ధీమాగా అందుకే చెబుతోంది.;
ఏపీలో టీడీపీ కూటమి పటిష్టంగా ఉంది. మూడు పార్టీలు కలసి కట్టుగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మేమే గెలుస్తామని కూటమి ధీమాగా అందుకే చెబుతోంది. అయితే వైసీపీ కూడా మేము గెలిచి తీరుతామని అంటోంది. రాజకీయాలు అంటే అన్నీ లెక్కలే. అయితే ఇవి మామూలు మాధమెటిక్స్ లెక్కలు కాదు, అందుకు భిన్నమైన లెక్కలుగా ఉంటాయి. ఇక్కడ లెక్కలు జనాలకు కూడా కళ్ళకు బాగా కనిపించాలి. ఇక కూటమిలో చంద్రబాబు పవన్ ఉన్నారు. పైన కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షాలు ఉన్నాయి. ఇలా ఇమేజ్ అంతా ఒక వైపు ఉంది. పైగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి మీద సోలోగా వైసీపీ ఎంత ఫైట్ చేసినా సీట్లు ఓట్లూ పెరగవచ్చు కానీ గెలుపు దక్కుతుందా అన్న చర్చ అయితే విశ్లేషకులలో ఉంది.
పొత్తు పెట్టుకోవాల్సిందే :
ఏపీలో చూస్తే వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తోంది. 2012లో ఆ పార్టీ పుట్టింది. కానీ ఇప్పటిదాకా ఏ పార్టీతోనూ కలిసింది లేదు. సోలోగా వస్తాం, సిం హం సింగిల్ అని చెబుతోంది. కానీ అవతల వైపు చూస్తే ఆట వేరుగా ఉంది. 2019లో వైసీపీ గెలిచింది అంటే ప్రత్యర్ధులు కూడా సింగిల్ గానే పోటీ చేశారు కాబట్టి ఓట్లు చీలి వైసీపీకి మంచి ఎడ్జ్ వచ్చింది అని విశ్లేషణలు ఉన్నాయి. 2024లో చూస్తే సీన్ మొత్తం మారింది. ఇక 2029 లో ఎంత చెడ్డా మరెంత వ్యతిరేకత ఉన్నా కూటమి అంతా ఒక్కటిగా ఉంటే కొంత శాతం సీట్లు ఓట్ల షేర్ తగ్గవచ్చేమో కానీ అధికారం మారేది ఉండదని కూడా అనే వారు ఉన్నారు. మరి వైసీపీ ఏమి చేయాలి అంటే పొత్తు పెట్టుకోవాలి అన్నది అయితే పార్టీలో ఒక చర్చగా ఉంది అని అంటున్నారు.
ఇండియా కూటమి వైపుగా :
ఇక దేశంలో ఇండియా కూటమి ఒక వైపు ఎన్డీయే కూటమి మరో వైపు ఉన్నాయి. కేంద్రంలో అధికారం కోసం ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలు అయితే పెద్దగా ఫలించడం లేదు, మోడీ ఇమేజ్ తో వరస విజయాలు ఎన్డీయే కూటమికి దక్కుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్డీయే పక్షాన ఉన్న పార్టీలూ గెలుస్తున్నాయి. అది మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, రుజువు అయింది. ఇక ఏపీలో అదే జరిగింది. దీంతో ఇండియా కూటమి లో ఉన్న కాంగ్రెస్ వామపక్షాల్తో వైసీపీ చేతులు కలిపినా ఏపీ వరకూ చూస్తే వాటి ప్రభావం నామమాత్రంగా ఉంది. పైపెచ్చు ఆ పార్టీలతో కలిస్తే వైసీపీ మీద బీజేపీ నేరుగా మూడో కన్ను తెరచే ప్రమాదం కూడా ఉంది అని అంటున్న వారూ ఉన్నారు.
కమలం తో కరచాలనం :
ఈ నేపథ్యంలో వైసీపీలో క్యాడర్ నుంచి వినిపిస్తున్నది ఏంటి అంటే బీజేపీతోనే వైసీపీ పొత్తు పెట్టుకోవాలని. అది జరిగే పనేనా అన్నది అయితే ఎవరూ ఆలోచించడం లేదు, కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఆ పార్టీకి ఎదురెళ్తే ఇబ్బంది కాబట్టి పొత్తు లేదా అవగాహనతోనే వైసీపీ ముందుకు సాగాలని అంటున్న వారూ ఉన్నారు. ఇక ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది. బీజేపీకి కావాల్సింది ఎంపీ సీట్లు. అయితే బీజేపీ టీడీపీని వదులుకుని బయటకు రాదు, సంధానకర్తగా పవన్ మధ్యలో ఉన్నారు అందువల్ల ఈ చెలిమి వైసీపీ క్యాడర్ కోరుకున్నా జరిగేది ఉండదని అంటున్నారు.
అవగాహనను కూడా వ్యతిరేకిస్తారు :
అదే సమయంలో కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఏపీలో షిఫ్ట్ అయింది. వారే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు, అలాగే రాయలసీమలో బలమైన రెడ్డి సామాజిక వర్గం. వీరంతా బీజేపీతో వైసీపీ అవగాహనను కూడా వ్యతిరేకిస్తారు అని అంటున్నారు. జగన్ వైఖరి చూసినా బీజేపీతో పొత్తులకు ఏ మాత్రం సిద్ధంగా ఉండరని అంటున్నారు. మరి వైసీపీ 2029 లో ఏమి చేయాలి అంటే ఒంటరిగా పోటీ చేయడమే అన్న మాట ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగా సమయం ఉంది కాబట్టి ఏపీ రాజకీయాలు ఎలా అయినా మారుతాయా అన్న చర్చ కూడా ఉంది.