డీఎస్సీ పోరు...వైసీపీకి వృధా ప్రయాసేనా ?
మెగా డీఎస్సీలో అక్రమాలు అవినీతి జరిగింది అంటూ వైసీపీ చేస్తున్న పోరాటం రాను రానూ ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతోందా అన్న చర్చ వస్తోంది.
మెగా డీఎస్సీలో అక్రమాలు అవినీతి జరిగింది అంటూ వైసీపీ చేస్తున్న పోరాటం రాను రానూ ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతోందా అన్న చర్చ వస్తోంది. మెగా డీఎస్సీ జరిగింది గత ఏడాది. ఫలితాలు కూడా అపుడే వచ్చాయి. ఏడాది తరువాత అందులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎలుగెత్తి చాటడంలోనే కొంత డొల్లతనం ఉంది. నిజంగా జరిగినా కూడా ప్రధాన ప్రతిపక్షం వాటిని గుర్తించడంలో ఇంత లేటు అయిందా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. మరో వైపు చూస్తే డీఎస్సీ ద్వారా ఏకంగా పదహారు వేల మందికి ఉపాధి లభించింది. వారూ వారి కుటుంబాలు ఇపుడు హాయిగా కొలువులలో ఉంటే అక్రమాలు అంటూ వైసీపీ రోడ్డెక్కడం వల్ల కలిగే కొత్త ప్రయోజనం ఏమిటో అన్నది కూడా అర్థం కావడం లేదని అంటున్నారు.
ఇంతకీ వారేరీ :
వైసీపీ పట్టుదలగా గత పది రోజులుగా డీఎస్సీ మీద నిరసనలు చేపడుతోంది. అయితే డీఎస్సీ వల్ల నష్టపోయామని చెబుతున్న వారు కానీ ఆరోపించిన వారు కానీ ఈ నిరసనలలో ఎక్కడ అని టీడీపీ నుంచి సూటి ప్రశ్న వస్తోంది. అలాగే నిరుద్యోగ యువత అంటోంది వైసీపీ. మరి ఆ నిరుద్యోగ యువత అయినా వైసీపీ వెంట ఉందా అంటే అదీ లేదు, జెన్ జీ అంటున్నారు కానీ ఆ ఆనవాళ్ళు కూడా అసలు కనిపించడం లేదు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులే కనిపిస్తున్నారు. దాంతో టీడీపీ చేస్తున్న విమర్శలే జనంలోకి వెళ్తున్నాయని అంటున్నారు.
వారి ఆగ్రహం నిజమే కదా :
గత ఏడాది ఉద్యోగాలు పొంది కొలువుల్లో చేరిన వారు అయితే వైసీపీ పోరు మీద ఆగ్రహంగా ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులు అయితే నిరసనలు కూడా పోటీగా నిర్వహించారు. మరి పదహారు వేల మంది వారి కుటుంబాలు అన్నీ కలుపుకుంటే అక్కడ పెద్ద నంబరే వైసీపీకి వ్యతిరేకంగా తయారు అవుతోంది కదా దీనిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అని అంటున్నారు. పోనీ నష్టపోయిన డీఎస్సీ యువత వెంట ఉంటే వారి మద్దతు అయినా తమకు ఉందని వైసీపీ చెప్పుకునే వీలు ఉంది. కానీ అలా జరగడం లేదు. దాంతో వైసీపీ ఎందుకోసం ఎవరి కోసం ఈ నిరసనలు చేస్తుంది అన్నదే ఇపుడు చర్చగా మారింది అని అంటున్నారు.
జరిగే డిమాండ్లేనా :
ఇక నారా లోకేష్ రాజీనామా చేయాలని అలాగే మెగా డీఎస్సీ అవతకవకల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు డిమాండ్లూ నెరవేరే అవకాశాలు ఉన్నాయా అంటే లేవనే జవాబు వస్తుంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి ఉంది. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అలాంటిది తమ ప్రభుత్వం మీద సీబీఐ వేసేందుకు కేంద్రం ఎలా సిద్ధపడుతుంది అని కూడా అంటున్నారు. దీంతో ఎంతకాలం వైసీపీ వీధులలోకి వచ్చి నిరసనలు చేసినా జరిగేది ఒరిగేది ఏమి ఉంటుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జనాలకు చెప్పారు కాబట్టి :
మొత్తం మీద చూస్తే వైసీపీ అంటున్నట్లుగానే డీఎస్సీలో అవకతవకలు జరిగాయన్నది జనంలో చర్చకు పెట్టారు, కొద్ది రోజులు వైసీపీ ఆందోళనలు చేసింది. దాంతో ఇక ఈ ఇష్యూకి ముగింపు పలికితే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకా ఎన్నో సమస్యలు ఏపీలో ఉన్నాయి. వాటి మీద కూడా వైసీపీ ఆందోళన చేయాల్సి ఉంది. అందువల్ల ఒక్కటే ఇష్యూని పట్టుకుని లాగుతూ పోతూ ఉంటే దాని వల్ల వచ్చే మైలేజ్ ఏమి ఉంటుందని కూడా చర్చ సాగుతోంది. అయితే వైసీపీ అధినాయకత్వం తీరు చూస్తూంటే దీనిని మరింతగా లాగాలనే అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అలా అయితే ఇది ఎప్పటికీ తేలని వ్యవహారమే అవుతుందని కూడా అంటున్నారు.