ఢిల్లీలో చాయ్.. వాషింగ్టన్ లో కాఫీ.. చైనా జిన్‌పింగ్ 'డబుల్ గేమ్'

ఒకవైపు భారత్‌తో బార్డర్ గొడవలు సర్దుబాటు చేసుకుంటున్నట్లు నటిస్తూనే మరోవైపు అమెరికాతో ట్రేడ్ వార్, చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయితీలను తెంపుకోవడానికి జిన్‌పింగ్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు.

Update: 2026-09-26 02:45 GMT

రాజకీయ దౌత్యంలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే మాట పాతదే కావచ్చు.. కానీ దాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమలు చేస్తున్న తీరు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీతో 'సరిహద్దుల్లో ప్రశాంతత.. భాయ్-భాయ్' అని స్వీట్ మాటలు చెప్పిన జిన్‌పింగ్.. కట్ చేస్తే.. కేవలం 12 రోజుల వ్యవధిలోనే సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో డోనాల్డ్ ట్రంప్‌తో హగ్గులు, షేక్‌హ్యాండ్లు ఇస్తూ ప్రత్యక్షమయ్యారు. ఈ 'స్పీడ్' చూస్తుంటే బీజింగ్ దౌత్యం వైఫై కంటే వేగంగా పనిచేస్తోందనిపిస్తోంది.

ఒకవైపు భారత్‌తో బార్డర్ గొడవలు సర్దుబాటు చేసుకుంటున్నట్లు నటిస్తూనే మరోవైపు అమెరికాతో ట్రేడ్ వార్, చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయితీలను తెంపుకోవడానికి జిన్‌పింగ్ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. చైనా వేస్తున్న ఈ వింత పాచికలు చూస్తుంటే "ఎటు గాలి వీస్తే అటు తూర్పారపట్టే" పాత సామెత గుర్తురాక మానదు.

‘చైనా + 1’ సీన్‌కి రివర్స్ గేర్ పడుతుందా?

చైనాతో వేగలేక ప్రపంచ దేశాలన్నీ "చైనా ప్లస్ వన్" అంటూ ప్రత్యామ్నాయం కోసం భారత్, వియత్నాంల వైపు చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అవకాశాన్ని అందుకోవడానికి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగానికి ఎర్ర తివాచీ పరిచింది. అయితే ఇప్పుడు జిన్‌పింగ్ వెళ్లి ట్రంప్‌తో "మనకేటి గొడవలు మావా.. సర్దుకుందాం" అని డీల్ కుదుర్చుకుంటే ఈ 'ప్లస్ వన్' ఆశలపై డ్రాగన్ మళ్లీ నీళ్లు చల్లే ప్రమాదం ఉందనే చర్చ మొదలైంది. పాశ్చాత్య కంపెనీలు మళ్లీ బీజింగ్ దారిపడితే భారత్‌కు రావాల్సిన కొత్త పెట్టుబడుల పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..

అరుదైన ఖనిజాలు.. పొరుగు పొత్తులు..

కేవలం వాణిజ్యమే కాదు, 'రేర్ ఎర్త్ మినరల్స్' నుంచి స్పేస్ సాంకేతికత వరకు చైనా దగ్గర బోలెడంత సరుకు ఉంది. అమెరికాతో చైనా ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే గ్లోబల్ సప్లై చైన్ సమీకరణాలు మారడం ఖాయం. ఇక మరోవైపు రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడం.. ఇరాన్ పంచాయితీలు ఎలాగూ ఉన్నాయి. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో ఈ దేశాల ప్రస్తావన వస్తే ఆసియా ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త 'డ్రామా' మొదలవుతుంది.

న్యూఢిల్లీ ముందున్న 'రియల్' ఛాలెంజ్

చైనా వేసే ఈ డబుల్ గేమ్ ఎత్తుగడలు భారత్‌కు కొత్తేమీ కావు. చైనా-అమెరికాలు ఎంత క్లోజ్ అయినా ఎంత కొట్టుకున్నా.. చివరకు మన ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవడమే న్యూఢిల్లీ అసలు పరీక్ష. సరిహద్దు వద్ద చైనా 'చేతిలో చెయ్యి.. వెన్నుపోటు' నైజాన్ని నిశితంగా గమనిస్తూనే ఉండాలి. అమెరికాతో వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. చైనాపై ఆధారపడటం తగ్గించుకుని.. స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని మేక్ ఇన్ ఇండియా మరింత పెంచుకోవాలి.

జిన్‌పింగ్ ఢిల్లీలో హ్యాండ్‌షేక్ ఇచ్చి వాషింగ్టన్‌లో కాఫీ తాగినా.. భారత్ మాత్రం తన సొంత ముద్రతో "మా రూటే వేరు" అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది..

Tags:    

Similar News