జగన్ ధైర్యం ఏమిటి...11 చోట్ల ఎన్నికలకు రెడీనా ?

ఏపీలో మినీ ఎన్నికల సమరాన్ని వైసీపీ గట్టిగా కోరుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. లేకపోతే అసెంబ్లీకి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకోవడం వెనక ఏమి ఉంటుందని అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

Update: 2026-08-13 03:51 GMT

ఏపీలో మినీ ఎన్నికల సమరాన్ని వైసీపీ గట్టిగా కోరుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. లేకపోతే అసెంబ్లీకి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకోవడం వెనక ఏమి ఉంటుందని అన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఏపీలో చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి 26 నెలలు అయింది. ఈ మధ్య కాలంలో కూటమి అసెంబ్లీ సమావేశాలను బాగానే నిర్వహించింది. బడ్జెట్ సెషన్ అలాగే వర్షాకాల శీతాకాల సమావేశాలను ఠంచనుగా నిర్వహించింది. రెండు సందర్భాలలో బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ప్రసంగానికి తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడా హాజరు కాలేదు. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా వైసీపీ రావడం లేదు అన్నది తెలిసిందే.

అనర్హత వేటు ఖాయమా :

ఎవరైనా సభ్యుడు సభకు ఏకంగా అరవై రోజుల పాటు గైర్ హాజరు అయితే అనర్హత వేటు పడుతుంది అని అంటున్నారు. దీని మీద రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూస్తే కనుక ఆర్టికల్ 101(4) 190(4)) కింద సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే సభ ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అవకాశం ఉంటుంది.ఈ నిబంధన పార్లమెంట్ సభ్యులకు అయితే ఆర్టికల్ 101(4), అదే రాష్ట్ర శాసనసభ సభ్యులకు అయితే ఆర్టికల్ 190(4)గా వర్తిస్తుంది. దీనికి కొంత ప్రొసీడింగ్ ఉంటుంది. అరవై రోజుల గైర్ హాజర్ తో సభ్యుడి గడువు ముగిసినంత మాత్రాన సభ్యత్వం దాని అంతట అదే రద్దు కాదు. సభ లేదా సభాధ్యక్షులు స్పీకర్ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా తీర్మానం చేసి ప్రకటించాలి. ఇక ఈ విషయంలో రోజుల లెక్కింపు గురించి చూస్తే ఈ 60 రోజుల కాలంలో సభ వాయిదా పడిన రోజులు లేదా నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు సభ వాయిదా నిరసన వంటి వాటి వల్ల వాయిదా పడిన రోజులను కలపరు. అయితే ఎవరైనా సభ్యుడు అనారోగ్యం లేదా ఇతర కారణాలతో గైర్హాజరైతే సభ నుంచి ముందే అనుమతి కోరవచ్చు సభ ఆ విజ్ఞప్తిని ఆమోదిస్తే సభ్యత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు.

సభ తలచుకుంటే :

మరి రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం సభ తలచుకుంటే వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వం అయితే రద్దు అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికి అరవై రోజులు కనుక గడువు పూర్తి అయితే స్పీకర్ సభలో తీర్మానం పెట్టి ఆమోదిస్తే చాలు ఆ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటిస్తారు. ఆ వెంటనే దానిని అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి తెలియచేస్తారు. ఆ మీదట ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఆయా చోట్ల నిర్వహిస్తుంది. ఇది చూడడానికి సులభతరం అయిన ప్రక్రియగా ఉన్నా ఎక్కడా కూడా ఇంతవరకూ ఈ విషయంలో ఈ దిశగా ప్రొసీడింగ్స్ అయితే జరగలేదు అని అంటున్నారు. మరి ఏపీలో రాజకీయం ఢీ అంటే ఢీ అంటోంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు.

ఉప ఎన్నికలు వస్తే కనుక :

ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అంటూ వస్తే కనుక ఏపీలో రాజకీయం పీక్స్ కి చేరుతుంది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీయే గెలుస్తుంది. ఏపీలో చూస్తే మూడు పార్టీలతో కూటమి పటిష్టంగా ఉంది. దాంతో వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు తెచ్చినా తేవచ్చు అని అంటున్నారు. దాంతో ఏపీలో పెద్ద ఎత్తున జరిగే ఉప ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డి వైసీపీకి ఏపీలో పొలిటికల్ గ్రాఫ్ పెరగలేదని ఈ ఉప ఎన్నికలతోనే చెక్ చెప్పేలా చూడొచ్చు. మరి కూటమి ఇంతలా పట్టుదల మీద ఉంటే వైసీపీ వ్యూహం ఏమిటి అన్నదే అసలైన చర్చ.

వ్యతిరేకత ఉందనేనా :

ఏపీలో ఉప ఎన్నికలు అంటూ జరిగితే రెండున్నరేళ్ళ పాలన అప్పటికి పూర్తి అవుతుంది. ఆ విధంగా వచ్చే ఉప ఎన్నికల్లో కూటమి మీద పూర్తి వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తాము గెలిచి చూపించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తూండవచ్చు అని అంటున్నారు. అలా గెలిచి ఏపీలో కూటమికి వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలని జగన్ అనుకుంటున్నారా అన్నదే ఇపుడు ప్రశ్నగా ఉంది. మొత్తం మీద 11 స్థానాల విషయంలో కనుక అనర్హత వేటు పడితే ఏపీ రాజకీయం పూర్తిగా సంచలనానికి వేదికగా మారిపోవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News