జగన్ అదే నమ్ముకున్నారా ?
వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఎపుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన జనాన్ని పైన ఉన్న దేవుడిని నమ్ముకుంటానని తరచూ చెబుతూ ఉంటారు.;
వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఎపుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన జనాన్ని పైన ఉన్న దేవుడిని నమ్ముకుంటానని తరచూ చెబుతూ ఉంటారు. అది మంచిదే కానీ వాటితో పాటుగా ఆయన పార్టీని పార్టీ నిర్మాణాన్ని నమ్ముకోవాల్సి ఉంటుంది కదా అని అంటున్నారు. పైన దేవుడు కింద జనాల దీవెనలు ఎన్ని ఉన్నా పార్టీ క్యాడర్ పనిచేయకపోతే విజయాలు సొంతం కావు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో విపక్షంలోకి వచ్చిన పార్టీగా వైసీపీ పార్టీని పునర్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. పార్టీలో లోపాలను పూర్తిగా ఆత్మ విమర్శతో సరిచేసుకోవాల్సి ఉంటుంది. తప్పులు ఎక్కడ జరిగాయన్నది భేషజం లేకుండా సమీక్ష చేసి మరీ సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
కానీ వైసీపీలో అవేమీ జరగడం లేదు అని అంటున్నారు. పార్టీలో ఇంకా పనిచేయని వారు ఉన్నారు. జనాలకు పార్టీ జనాలకు నచ్చని వారు ఉన్నారు. సైలెంట్ గా ఉంటూ పార్టీని కదలనీయకుండా చేసేవారు ఉన్నారు. అయితే వీరి విషయంలో అధినాయకత్వం ఉదాశీనంగానే ఉంటోంది అని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గానికి ఇంచార్జిలను నియమించారు. వారు పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికపుడు చెక్ చేయడం దారికి రాని పార్టీకి ఇబ్బందిగా ఉన్న వారిని పక్కకు పెట్టడం చేయాల్సి ఉండగా ఎందుకో ఆ విషయంలో నిర్లక్ష్యం సాగుతోంది అని అంటున్నారు. మరో విషయం తీసుకుంటే ఈ రోజుకీ వైసీపీలో చాలా చోట్ల ఇంచార్జిలు లేరు. కోస్తా జిల్లాలలో పార్టీ బలహీనంగా ఉంది.
ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ నిస్తేజంగా ఉంది. ఈ క్రమంలో పార్టీలో చురుకుదనం తీసుకుని రావడానికి ఎక్కడికక్కడ కొత్త నాయకత్వాన్ని పనిమంతులను ప్రోత్సహించాల్సి ఉందని అంటున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే జనాలలో వ్యతిరేకత ఉందని అది కాస్తా రానున్న కాలంలో తీవ్రతరం అవుతుందని ఆ వ్యతిరేకతనే మరోసారి తనను అధికారంలో కూర్చోబెడుతుందని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంటే జగన్ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకున్నారని అంటున్నారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే విపక్షాన్ని అధికారంలోకి తెచ్చిన సందర్భాలు లేవని అంటున్నారు. ఏ పార్టీ అయినా గెలవాలీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఆ పార్టీ పట్ల సానుకూలత కూడా ఉండాలని అంటున్నారు. 2019లో వైసీపీ పట్ల జనాలకు మోజు కూడా గెలవడానికి కారణం అయింది అని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా 2024లో కూటమి పట్ల సానుకూలత కలసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
అందువల్ల పార్టీని పునర్ నిర్మించుకోవడంతో పాటు గత అయిదేళ్ళలో వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాల కారణంగా దూరమైన వర్గాలను ఎలా దగ్గరకు చేర్చాలో ఆలోచన చేయడం, తాము మారామన్న సందేశాన్ని పంపించడం ద్వారానే సానుకూలతను తెచ్చుకోగలరని అంటున్నారు. ఆ విధంగా వైసీపీ కనుక తీరు మార్చుకోకపోతే ఇబ్బందులే అని అంటున్నారు. మరి కేవలం యాంటీ ఇంకెంబెన్సీనే నమ్ముకుంటే వైసీపీకి రిస్క్ చేస్తున్నట్లే అని కూడా అంటున్నారు.