సీఎం చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ... సంగతి ఏమిటి?
అవును... బుధవారం సచివాలయంలో చంద్రబాబుతో వెళ్లిన వైఎస్ సునీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబును కోరారని తెలుస్తోంది.;
ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ లలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటనే సంగతి తెలిసిందే. ఈ హత్య కేసు చుట్టూ తీవ్ర చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన కుమార్తె వైఎస్ సునీత.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ కేసులో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిగా మారింది!
అవును... బుధవారం సచివాలయంలో చంద్రబాబుతో వెళ్లిన వైఎస్ సునీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబును కోరారని తెలుస్తోంది. ఇదే సమయంలో... వివేకా హత్య కేసులో పట్టుకోవాల్సిన నిందితులు ఇంకా చాలామంది ఉన్నారని.. అసలైన దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.
కాగా... గత ఏడాది సెప్టెంబర్ లోనూ చంద్రబాబును వైఎస్ సునీత కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... తన తండ్రి వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై, బాధితులమైన తమపై గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని.. వాటిపై లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలు బయటపెట్టాలని చంద్రబాబుకు వివేకా కుమార్తె విన్నవించారు.
ఇదే సమయంలో... వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తప్పుడు కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై సీఐడీతో లోతైన దర్యాప్తు చేయించాలని నాడు ఆమె బాబును కోరారు. ఈ సందర్భంగా స్పందించిన బాబు... తనకు అన్ని విషయాలూ తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు!
మరోవైపు ఇటీవల వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ, సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐపై మూడు ప్రశ్నలు సంధించింది!
ఇందులో భాగంగా... వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తుందా.. లేదా..?, ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయం ఏంటి..?, వివేకా హత్య కేసు విచారణ, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా.. లేదా..? వంటి మూడు ప్రశ్నల్ని సీబీఐకి సుప్రీంకోర్టు సంధించింది.!
ఈ పరిణామాల నేపథ్యంలో... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.