సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్.. జగన్ పై షర్మిల ఫైర్
జగన్ పర్యటనపై ఆంక్షలు విధించలేకపోవడంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.;
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తన ఫోన్ ట్యాపింగ్ చేసిన జగన్ పై రెండు రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల తాజాగా జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ఆయన ఓ బెట్టింగ్ రాయుడి విగ్రహాన్ని ఆవిష్కరించారని, ఇలాంటి కార్యక్రమం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు షర్మిల.
బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై గురువారం మీడియాతో మాట్లాడిన షర్మిల మాజీ సీఎం జగన్ వైఖరిని తప్పుబట్టారు. బెట్టింగులో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే, ఏడాది తర్వాత పరామర్శిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బెట్టింగు రాయుడికి విగ్రహాలు కట్టడం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మానేసిన జగన్, బల ప్రదర్శనలకు దిగారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి బల ప్రదర్శనలకు ఎలా అనుమతి ఇచ్చిందని షర్మిల నిలదీశారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇస్తున్నారా? అని షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీకి ఆంక్షలు విధిస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పర్యటనపై ఆంక్షలు విధించలేకపోవడంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘‘మాకు అర్థం కాక మీడియా సాక్షిగా చంద్రబాబును అడుగుతున్నాం. మేము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్టు చేస్తారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తే భగ్నం చేస్తారు. ఆంక్షలు అన్నీ కాంగ్రెస్ పార్టీకేనా?’’ అంటూ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ అనే వ్యక్తి ప్రధాని మోదీకి దత్త పుత్రుడు అనే కారణంగానే ఆయన పర్యటనలను అడ్డుకోవడం లేదని విమర్శించారు.
జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా? పోలీసులను సైతం కొనుగోలు చేస్తున్నాడని షర్మిల మండిపడ్డారు. బుధవారం జగన్ పర్యటన కారణంగా ఇద్దరు చనిపోయారని ఆయా కుటుంబాల ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు షర్మిల. పోలీసులు వంద మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారో సర్కారు చెప్పాలని నిలదీశారు.