కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల!

కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.;

Update: 2025-04-19 09:01 GMT

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు త్వరలో పదవీయోగం పట్టనుందని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున ఆమెను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరించడంతోపాటు కర్ణాటకలోనూ బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీ నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యమిస్తున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.

కర్ణాటకలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడే షర్మిలను రాజ్యసభకు పంపుతామని ఆ పార్టీ పెద్దలు హామీ ఇచ్చిరాంటున్నారు. దీంతో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారని అంటున్నారు. రాజ్యసభలో బలమైన గొంతుక అవసరం అవ్వడం, షర్మిల కూడా వాగ్దాటి ఉన్న నాయకురాలు కావడంతో ఆమెను రాజ్యసభకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.

షర్మిలకు రాజ్యసభ ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. బలమైన సామాజిక నేపథ్యంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుర్తింపు వల్ల షర్మిలకు పదవి ఇవ్వడం రాజకీయంగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అధికారిక పదవి లేకపోవడం వల్ల షర్మిల పోరాటానికి తగిన గుర్తింపు రావడం లేదని అంటున్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఆమె వెన్నుచూపని పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించడంతో ఆమె ప్రయత్నాలకు తగిన మద్దతు లభించడం లేదంటున్నారు.

షర్మిలను రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీలోని పాత కాంగ్రెస్ శ్రేణులకు నమ్మకం కలిగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ కేడర్ ను తిరిగి ఆకర్షించాలని చూస్తోంది. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తోందంటున్నారు. ఏ విషయంపైన అయిన స్పష్టమైన వైఖరి ప్రదర్శించగల నేర్పు, మాట తీరు కూడా షర్మిలకు అదనపు అడ్వాంటేజ్ అయిందని అంటున్నారు. ఆమెలా జనాలను ఆకట్టుకునేలా మాట్లాడే వారు కాంగ్రెస్ లో ఇప్పుడు తగ్గిపోయారని, దీంతో షర్మిల సేవలను దక్షిణాదిలో ఎక్కువగా వాడుకోవచ్చని కాంగ్రెస్ ఆలోచిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News