‘‘కుప్పంలో వైసీపీ చేసిందే.. పులివెందులలో టీడీపీ చేసింది.. ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’’ వైఎస్ షర్మిల ఫైర్

షర్మిల వ్యాఖ్యలతో పులివెందుల ఫలితం వైఎస్ కుటుంబంలో ప్రకంపనలు రేపుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.;

Update: 2025-08-15 19:59 GMT

తన స్వస్థలం పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అక్రమ పద్ధతుల్లో పులివెందులలో గెలిచిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షర్మిల జెండా వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పులివెందులలో టీడీపీ విజయంపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పోటాపోటీ రాజకీయం వల్ల రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన తీసుకువస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

ఓటమిపై వైఎస్ కుటుంబం అంత్మరథనం

షర్మిల వ్యాఖ్యలతో పులివెందుల ఫలితం వైఎస్ కుటుంబంలో ప్రకంపనలు రేపుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులను మాజీ ముఖ్యమంత్రి జగన్ చేజేతులా చేజార్చుకోవడాన్ని షర్మిల తేలిగ్గా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే టీడీపీ విజయాన్ని ఆమె ఎక్కడా సమర్థించలేదని అంటున్నారు. తన సోదరుడు జగన్ టార్గెట్ గా గత ఎన్నికల నుంచి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న షర్మిల.. పులివెందుల ఎన్నిక విషయంలో అధికార పార్టీని సైతం తప్పుబట్టారు. ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలనే ఆలోచనతో గతంలో కుప్పంలో వైసీపీ వ్యవహరించిన విధంగానే పులివెందులలోనూ అక్రమాలకు పాల్పడ్డారని షర్మిల వ్యాఖ్యానించడం చూస్తే రాష్ట్రంలో రెండు పార్టీలనూ ఓకే గాటన కట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు.

టీడీపీ గెలుపును షర్మిల ఎలా తీసుకున్నారంటే..

పులివెందులలో టీడీపీ గెలవడం ఒక ఎత్తు అయితే.. వైఎస్ కుటుంబం పట్టు కోల్పోయిందన్న ప్రచారమే ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని షర్మిల మాటల బట్టి అర్థం అవుతోందని అంటున్నారు. జగన్ పార్టీ వల్ల ఓడిపోయినప్పటికీ, ఆ ఓటమికి గతంలో ఆయన వ్యవహరించిన తీరే కారణమని షర్మిల భావిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, కుప్పంలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుందో.. ఇప్పుడు టీడీపీ అదే వ్యూహాన్ని అనుసరించి వైసీపీని దెబ్బకొంటిందని షర్మిల చెప్పడం ఇందులో భాగమేనంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒకేలా పనిచేస్తున్నారని షర్మిల మండిపడుతున్నారు. ఇద్దరూ కేంద్రంలో ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని, కాకపోతే చంద్రబాబు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే, జగన్ దొంగచాటుగా మోదీకి కొమ్ముకాస్తున్నారని షర్మిల ఆరోపించారు.

ప్రధానికి ఊడిగం

దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తాము ఓటు చోర్ ఉద్యమం చేస్తుంటే, రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీ ఊడిగం చేస్తున్న వాళ్లే అన్నారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ బలపడాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ గెలవాలని షర్మిల వ్యాఖ్యానించారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే జగన్ మాట్లాడటం లేదని షర్మిల ధ్వజమెత్తారు. దేశం అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని షర్మిల వ్యాఖ్యానించారు. అనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయ్యిందని, ఇప్పుడు మళ్లీ మోదీ చేతిలో బందీ అయిందని తెలిపారు. మోదీ నయా భారత్ అనడం విడ్డూరమని షర్మిల అన్నారు. ఎక్కడుంది నయా భారత్? ఏంటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ జెండా, అజెండా అమలు చేయడం నయా భారత్ అంటారా? అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలని చూడటం నయాభారత్ అంటారా? అని నిలదీశారు. ఇది నయా భారత్ కాదే.. దగా భారత్ అంటూ షర్మిల మండిపడ్డారు.

Tags:    

Similar News