ఫోన్ ట్యాపింగ్...షర్మిలకు పిలుపు రాదా ?
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ స్టార్ట్ అయిన వెంటనే ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపేందుకు పీసీసీ చీఫ్ షర్మిల ప్రయత్నించారు.;
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ స్టార్ట్ అయిన వెంటనే ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపేందుకు పీసీసీ చీఫ్ షర్మిల ప్రయత్నించారు. ఆమె నేరుగా ఏపీ మాజీ సీఎం తన అన్న అయిన జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని దానికి రుజువు తన సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అని కూడా చెప్పారు. ఆయనే తన వద్దకు వచ్చి మరీ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా చెప్పారని కూడా ఆరోపించారు. తన ఫోన్ తన భర్త ఫోన్ ఆనాడు ట్యాపింగ్ అయ్యాయని ఆమె చెప్పారు.
ఇక అనాటి సీఎంలు అయిన కేసీఆర్ జగన్ ఇద్దరి మీద ఆమె విమర్శలు చేశారు. ఇక దీని మీద మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని అయినా తనకేమిటి సంబంధం అన్నారు. ఇలా ఈ ఇష్యూ కొన్ని రోజుల పాటు రాజ కీయంగా రగిలింది. వార్తలలో బాగా నలిగింది.
మరి ఇంత రచ్చ జరిగిన తరువాత ఈ ఇష్యూలో తెలంగాణా ప్రభుత్వం నియమించి దర్యాప్తు చేయిస్తున్న సిట్ నుంచి షర్మిలకు ఏమైనా సమాచారం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణా సిట్ అయితే ఇప్పటివరకూ చూస్తే వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులను విచారణకు పిలుస్తోంది. వారి ఫోన్ ట్యాపింగ్ అయింది అని గుర్తించి మరీ వారిని విచారణకు హాజరు కమ్మంటోంది.
అలా బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వంటి వారు హాజరై తమకు ఉన్న సమాచారాన్ని సిట్ కి ఇచ్చారు. ఇక తాజాగా చూస్తే కనుక ఒక తెలుగు పత్రికాధిపతితో పాటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావులకు కూడా సిట్ పిలుపు వచ్చింది. మరి ఇంతమందిని విచారిస్తున్న సిట్ నుంచి షర్మిలకు ఎపుడు పిలుపు వస్తుంది అన్నదే చర్చగా ఉంది.
ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రముఖులు అందరినీ సిట్ విచారిస్తోంది. వీరిని బాధితులుగా గుర్తించి విచారణకు పిలుస్తోంది అలాగే వారి వద్ద ఉన్న సమాచారం కూడా అడిగి తీసుకుంటోంది. అయితే అందరి కంటే ముందే తన ఫోన్ ట్యాపింగ్ అయింది అని మీడియా ముఖంగా పలు మార్లు ప్రకటించిన షర్మిలను సిట్ ఎపుడు పిలుస్తుంది అన్నదే ఇక్కడ అంతా ఎదురుచూస్తున్నారు.
అయితే విషయమంటంటే ఫ్యోన్ ట్యాపింగ్ జరిగింది ఎవరెవరి మీద అన్నది లిస్ట్ సిట్ దగ్గర పక్కాగా ఉంది. ఇందులో విచారిస్తున్న వారి జాబితా విచారించబోయే వారి జాబితా కూడా సిట్ వద్ద ఉంది. అలాగే ఫ్యోన్ ట్యాపింగ్ అన్నది రాజకీయ వ్యూహం అయినపుడు రాజకీయ లాభం కోసమే చేశారని అనుకున్నపుడు అక్కడ ప్రధాన పార్టీల మీదనే గురి పెట్టారా అన్నది కూడా చర్చకు వస్తోంది
తెలంగాణాలో షర్మిల పార్టీని 2021 మధ్యలో స్థాపించారు 2024 జనవరిలో కాంగ్రెస్ ఓ విలీనం చేశారు మరి ఆమె పార్టీ ప్రభావం మీద కూడా ఏమైనా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళన చెందిందా అన్నది కూడా చూడాలి. అలా కనుక జరిగితే ఆమె ఫోన్ ట్యాపింగ్ అయి తీరుతుంది అని అంటున్నారు మరి వరస క్రమంలో షర్మిలకు కూడా సిట్ నుంచి పిలుపు వస్తుందా అన్నదే ఇక్కడ పాయింట్ గా ఉంది మరి.