తీవ్ర వ్యతిరేకతలో బాబు సర్కార్...జగన్ చెప్పిందిదే !
ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి పదిహేను నెలలు గడిచాయి. నాలుగవసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.;
ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి పదిహేను నెలలు గడిచాయి. నాలుగవసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో ముఖ్యమంత్రిత్వంలో కూటమి విజయవంతంగా పాలిస్తోంది అని మూడు పార్టీలు అంటున్నాయి. అయితే అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత వెల్లువగా కూటమి ప్రభుత్వం మూటకట్టుకుందని వైసీపీ అంటోంది. అనడమేంటి కీలక విషయాలలో జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది అని అంటోంది. ఆ విషయాలను వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సోదాహరణంగా చర్చించింది. ముఖ్యంగా అధినేత జగన్ మూడు అంశాలను పార్టీ వారి ముందు ఉంచారు. వీటి విషయంలో చూస్తే కూటమి మీద జనాలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు.
హామీల అమలు మీద యాంటీ :
సూపర్ సిక్స్ అన్నది కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణంగా చూస్తోంది వైసీపీ దాంతో ఈ హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏమీ చేయలేదని జగన్ తన పార్టీ వారికి చెప్పారు. తల్లికి వందనం పేరుతో పధకాన్ని అందరికీ వర్తింపచేస్తామని చెప్పారని కానీ చాలా మందికి ఈ పధకం అందలేదని పైగా 15 వేలు ఇస్తామని చెప్పి కేవలం తొమ్మిది వేలు, ఎనిమిది వేలు కూడా చాలా చోట్ల ఇచ్చారని జగన్ ఎత్తి చూపారు. అంతే కాదు ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని దానిని ఎగ్గొట్టారని జగన్ గుర్తు చేశారు. రైతులకు ఇస్తామన్న అన్నదాత పధకం కింద గడచిన ఏడాదిన్నర కాలంలో 30 వేలు రావాల్సి ఉంటే కేవలం అయిదు వేల రూపాయలనే వారి ఖాతాలో వేశారు అని జగన్ విమర్శించారు. వీటి మీద ఆయన పధకాల లబ్దిదారులలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలు వాటిని జనంలోకి బలంగా తీసుకుని వెళ్లాలని జగన్ సూచించారు.
శాంతి భద్రతల మీద కూడా :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అయిందని జగన్ చెప్పారు. మహిళల మీద చిన్నారుల మీద దాడులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని గుర్తు చేశారు. హోం మంత్రి అనిత సొంత జిల్లాలోనే ఒక చిన్నారి మీద అఘాయిత్యం జరిగితే ఎవరూ స్పందించలేదని జగన్ విమర్శించారు. అంతే కాదు దాడుల పరంపర అలా సాగుతోందని అన్నారు ఎవరికీ స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదు, ఆఖరుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని జగన్ ఆక్షేపిస్తూ లా అండ్ ఆర్డర్ అయితే ఏపీలో కట్టు తప్పిందని దీనిని ప్రజలు చాలా సీరియస్ ఇష్యూగానే చూస్తున్నారు అని అన్నారు. వైసీపీ హయాంలో చూస్తే కనుక దిశ యాప్ ద్వారా పది నిముషాలలో నిందితులను అదుపులోకి తీసుకున్న సందర్భాలు ఉండేవని అన్నారు.
రైతాంగం గోడు పెడుతోంది :
ఇక అతి ముఖ్యమైన మరో అంశాన్ని కూడా జగన్ చెప్పారు. రైతులు కూటమి ప్రభుత్వం తీరు మీద తీవ్ర ఆందోళనగా ఉన్నారని ఆయన పార్టీ వారికి గుర్తు చేశారు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర అన్నదే లేకుండా పోయింది అని జగన్ విమర్శించారు. ఈ రోజున చూస్తే ఉల్లిపాయలు, టమాటాలు పొగాకు, మామిడి రైతులు వీరంతా ప్రభుత్వ విధానాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆఖరుకు యూరియా కొరత ఎక్కువగా ఉందని దాంతో రైతులు పూర్తిగా ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఏ సమస్య రైతులు ప్రస్తావించినా వారి మీదనే కేసులు పెడుతున్నారని అన్నారు.
మరో వైపు ప్రైవేటీకరణ విధానాలకు పెద్ద పీట వేస్తున్నారని జగన్ అన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనుకుని వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చామని వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అన్నారు. ఇలాంటి వాటి మీద జనంలో చర్చకు పెట్టాలని జగన్ పార్టీ వారిని కోరారు. ఏది ఏమైనా ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది అని అన్నారు. ఆల్టర్నేషన్ గా వైసీపీ మాత్రమే ఉందని దాంతో జనాల మద్దతు తమ పార్టీకే దక్కుతుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ చెప్పిన ఈ కీలక అంశాలలో జనంలో వ్యతిరేకత ఈ రేంజిలో ఉందా అన్నది అయితే చర్చగా సాగుతోంది.