ఐఐటీల్లో ఆత్మహత్యలు ఆగడం లేదు.. ఇవే అసలు కారణాలంటున్నారు!

జనవరి 2021 - డిసెంబర్ 2025 మధ్య దేశంలోని 23 ఐఐటీలలో కనీసం 65 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గ్లోబల్ ఐఐటీ పూర్వ విద్యార్థుల సహాయ బృందం పొందుపరిచిన గణాంకాలు చూపిస్తున్నాయి!;

Update: 2026-01-22 18:30 GMT

ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇందులో.. మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న జూనియర్ కాలేజీ విద్యార్థి నుంచి ఐఐటీలో పీ.హెచ్.డీ చేస్తున్న స్కాలర్ వరకూ ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఐఐటీ-కాన్పూర్‌ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల క్యాంపస్‌ లలో మానసిక ఆరోగ్య సంక్షోభం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌ లో పీ.హెచ్‌.డీ స్కాలర్ రాంస్వరూప్ ఈశ్వరం క్యాంపస్ రెసిడెన్షియల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. రాజస్థాన్ కు చెందిన ఈశ్వరం.. జూలై 2023లో ఈ సంస్థలో చేరాడు.. ఎర్త్ సైన్సెస్ విభాగంలో పీ.హెచ్‌.డి చేస్తున్నాడు. ఈ క్రమంలో.. తన భార్య మంజు, మూడేళ్ల కుమార్తెతో క్యాంపస్‌ లోని న్యూ ఎస్.బీ.ఆర్.ఏ భవనంలో నివసించాడు.

ఈ ఘటనపై స్పందించిన డీసీపీ (వెస్ట్) కాసీం అబీదీ.. ప్రాథమిక విచారణలో అతను దీర్ఘకాలిక నిరాశకు గురైనట్లు తేలిందని అన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని.. పోలీస్ స్టేషన్‌ లో అతని భార్యను విచారిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. ఈశ్వరం గత రెండు సంవత్సరాలుగా ఆందోళన, నిరాశతో పాటు స్కిజోఫ్రెనియాతో పోరాడుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు!

ఆందోళన కలిగిస్తున్న ఘణాంకాలు!:

ఈ సందర్భంగా గత ఐదేళ్లలో ప్రధానంగా ఐఐటీలలో జరిగిన ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 2021 - డిసెంబర్ 2025 మధ్య దేశంలోని 23 ఐఐటీలలో కనీసం 65 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గ్లోబల్ ఐఐటీ పూర్వ విద్యార్థుల సహాయ బృందం పొందుపరిచిన గణాంకాలు చూపిస్తున్నాయి! ఈ క్రమంలో.. గత రెండు సంవత్సరాలలో 30 మంది ఆత్మహత్యలు నమోదయ్యాయి.

ఈ 30 ఆత్మహత్యలలో తొమ్మిది ఐఐటీ కాన్పూర్‌ లోనే జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 30 శాతం వాటా దేశంలోని ఏ ఒక్క ఐఐటీ క్యాంపస్‌ లోనైనా అత్యధిక సంఖ్యను సూచిస్తుంది. ఆ తర్వాత అత్యధికంగా గరఖ్ పూర్ లో 7 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో... ఢిల్లీ ఐఐటీలో 3, రూర్కీలో 3, గౌహతీలో 3 ఆత్మహత్యలు నమోదయ్యాయి!

ఈ క్రమంలో... నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) డేటా ప్రకారం.. 2023లో భారతదేశంలో 13,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే.. ప్రతిరోజూ దాదాపు 36 సంఘటనలు జరిగాయన్నమాట!

Tags:    

Similar News