రావద్దు జగన్ అంటూ పోలీసుల శ్రీముఖం

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్శీపట్నం పర్యటన డైలామాలో పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే సూచిస్తున్నాయి.;

Update: 2025-10-07 15:30 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్శీపట్నం పర్యటన డైలామాలో పడిందా అంటే జరుగుతున్న పరిణామాలు అదే సూచిస్తున్నాయి. జగన్ ఈ నెల 9న నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం సందర్శిస్తారు అని అయిదారు రోజుల క్రితం వైసీపీ నేతలు ప్రకటించారు. ఆనాడు అయితే జగన్ నేరుగా విశాఖకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా నర్శీపట్నం వెళ్తారు అని అనుకున్నారు. అయితే తరువాత చూస్తే జగన్ టూర్ కాస్తా పూర్తిగా మారింది అని అంటున్నారు. రాక రాక వస్తున్న జగన్ టూర్ ని అదిరిపోయే లెవెల్ లో నిర్వహించాలని వైసీపీ నేతలు అంతా డిసైడ్ అయ్యారు. దాంతో అనకాపల్లి జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రోడ్ షోలతో జగన్ పర్యటన చేయించాలని డిసైడ్ అయ్యారు.

భారీ ఎత్తున ప్లాన్ :

అంతే కాకుండా నక్కపల్లి లో బల్క్ డ్రగ్ పార్క్ బాధితులను విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను తీసుకుని వచ్చి జగన్ తో భేటీలు వేయించాలని కూడా ప్లాన్ చేశారు. ఆ మీదట మెడికల్ కాలేజ్ విషయంలో విద్యార్ధులు తల్లిదండ్రులతో మీటింగ్స్ భేటీలు ఇలా చాలా చాలా యాడ్ చేశారు మొత్తం మీద చూస్తే జగన్ పర్యటన మొదట అనుకున్న దాని కన్నా పూర్తి స్థాయిలో మారిపోయింది అని అంటున్నారు. దాంతో తొమ్మిదవ తేదీ పూర్తిగా వైసీపీ మయం అవుతుందని అంటున్నారు. దాంతో ఇక్కడే పోలీసులు విభేదించారని అంటున్నారు.

అనుమతులు లేవని ట్విస్ట్ :

జగన్ రోడ్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు ఆఖరి నిముషంలో భారీ షాక్ ఇచ్చేశారు. ఈ నెల 9న జరగాల్సిన జగన్ విశాఖ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాల్స్తొంచడంతో అది ఇపుడు రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. విశాఖలో అదే రోజు నగరంలో మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. మ్యాచ్ బందోబస్తు కారణంగా సిబ్బంది కొరత అని అంటున్నారు. జగన్ పర్యటనతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అందువల్ల ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వలేమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. తమ ఇదే విషయాన్ని వైసీపీ పెద్దలకు లేఖ ద్వారా తెలియచేశామని పోలీసులు చెబుతున్నారు.

వచ్చి తీరుతారన్న వైసీపీ :

జగన్ పర్యటనను అడ్డుకోవడం కోసమే ఈ రకమైన రాజకీయం చేస్తున్నారు అని వైసీపీ నేతలు కస్సుమంటున్నారు జగన్ ఎపుడు టూర్ చేయాలనుకున్నా పర్యటనలకు పర్మిషన్ ఇవ్వకపోవడమే అలవాటుగా మారిందని అంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 9న నర్శీపట్నం వెళ్తారని రోడ్ షోలు ఉంటాయని అంతే కాదు ఆయన టూర్ లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు.

మ్యాచ్ కూడా ఉండడంతో :

అయితే ఇంటర్నేషనల్ మహిళల క్రికెట్ మ్యాచ్ అదే రోజు విశాఖలో ఉంది. దాంతో సహజంగానే మ్యాచ్ పట్ల ఆసక్తి ఉంటుంది చాలా మంది వస్తారు అని అంటున్నారు. మ్యాచ్ జరిగితే ట్రాఫిక్ మళ్ళిపు ఉంటుంది. అదే సమయంలో జగన్ రోడ్ షో అంటే రెండు వైపుల నుంచి ఒత్తిడితో ట్రాఫిక్ కి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మొత్తం మీద జగన్ టూర్ రద్దు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. లేకపోతే హెలికాప్టర్ ద్వారా వెళ్లాలని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు ససేమిరా అంటున్నారు. దాంతో జగన్ పర్యటన ఇపుడు అధికార కూటమికి వైసీపీకి మధ్య రాజకీయ రచ్చను రగిలిస్తోంది.

Tags:    

Similar News