అప్పటి దాకా ఆగాల్సిందేనంటున్న జగన్ !
జగన్ ఇటీవల చెబుతున్న మాట ఒక్కటే. ఎవరు తనను కలసినా మరో మూడేళ్ళు ఆగండి అంటున్నారు.
జగన్ ఇటీవల చెబుతున్న మాట ఒక్కటే. ఎవరు తనను కలసినా మరో మూడేళ్ళు ఆగండి అంటున్నారు. ఆ మీదట కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది చెబుతున్నారు. అపుడు అన్ని విషయాలూ చూస్తామని అంటున్నారు. తాడేపల్లిలోని తన ఆఫీసుకు వచ్చినా లేక తాను పరామర్శకు ఎక్కడికి వెళ్ళినా జగన్ ఇదే రకమైన హామీ ఇస్తున్నారు. అలా తన వద్దకు వచ్చిన అమరావతి రైతులకు డీఎస్సీ రాసి జాబ్స్ రాని వారు ఇలా వివిధ సమస్యల మీద వచ్చిన వారికి జగన్ చెబుతున్నది ఇదే. లేటెస్ట్ గా విశాఖలో స్టీల్ ప్లాంట్ బాధితులకు ఓదార్పు ఇస్తూ కూడా జగన్ తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికీ కోటి రూపాయలు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించారు.
ఆత్మ విశ్వాసమేనా :
ఇది రాజకీయం. రాజకీయాల్లో ఎపుడూ అంచనాలు అన్నవి కచ్చితంగా జరుగుతాయని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అవి స్థిరంగా ఉండవు కాబట్టి. కచ్చితంగా తాము నెగ్గుతామని ఎవరైనా అనుకోవచ్చు అది ఆత్మ విశ్వాసంగా ఉన్నంత సేపు ఫరవాలేదు. అదే అతి విశ్వాసానికి దారి తీస్తేనే ఇబ్బంది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి రెండు సార్లు ఈ అతి విశ్వాసం దెబ్బ కొట్టింది అని పొలిటికల్ ట్రాక్ రికార్డు చూపిస్తోంది. 2014లో ఆల్ మోస్ట్ ఆల్ తామే వచ్చేస్తున్నామన్నంత హైప్ క్రియేట్ చేసింది వైసీపీ. తీరా చూస్తే 67 సీట్ల దగ్గరే జోరు ఆగిపోయింది. దానికి కారణం గెలిచేశామని ఆలోచించి గ్రౌండ్ వర్క్ కంప్లీట్ గా చేసుకోలేదని. అలాగే 2024 లోనూ అదే జరిగింది. వై నాట్ 175 అంటూ బరిలోకి దిగిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయని గుర్తు చేస్తున్నారు.
బలంగా కూటమి :
ఇక ఏపీలో మూడు పార్టీలతో కూటమి బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా 40 శాతం ఓటు షేర్ ఉంటుంది. జనసేనకు 2019లో ఆరు శాతం ఓటు షేర్ దక్కింది. అది 2024 కి ఇంకా పెరిగింది అని అంటున్నారు. బీజేపీకి ఒకటి నుండి మూడు శాతం ఓటు షేర్ ఉంటుంది. ఈ మూడూ కూడా కలసి కట్టుగా 2029లో కూడా వస్తామని అంటున్నాయి. దాంతో ఓటు షేర్ 50 ప్లస్ గానే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండొచ్చు అని ఒక లెక్క ఉంది. అంతే కాదు సామాజిక సమీకరణల పరంగా ప్రాంతాల వారీగా చూసినా కూటమికి మొగ్గు ఉందని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో బీసీలు గోదావరి జిల్లాలలో కాపులు, అలాగే కోస్తాలో కమ్మలు ఇలా చూస్తే మొత్తం ఉత్తరాంధ్రా దక్షిణాంధ్ర కలుపుకుని 101 సీట్లు ఉంటే ఇక్కడే కూటమి పై చేయి సాధిస్తే ఇక రాయలసీమలో వచ్చేవి అన్నీ బోనస్ గానే చూడాలని అంటున్నారు గతానికి పోలిస్తే రాయలసీమలోనూ టీడీపీ మరింతగా బలపడింది అని అంటున్నారు.
ఆల్టర్నేషన్ అభివృద్ధి అజెండాతో :
మరి ఇవన్నీ వాస్తవంగా ఉన్న పరిస్థితులు అయితే మేమే గెలిచేస్తామని వైసీపీ అధినాయకత్వం ధీమాకు పోవడం పట్ల చర్చ సాగుతోంది. ఈసారి జగన్ ఇమేజ్ కంటే కూడా ఆయన అయిదేళ్ళ పాలన అలాగే కూటమి అయిదేళ్ళ పాలన రెండూ బేరీజ్ వేసుకుని జనాలు తీర్పు ఇస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో సంక్షేమం వరకూ వైసీపీ ఓకే అనిపించుకున్నా కూటమికి ఆల్టర్నేషన్ అభివృద్ధి అజెండాతో ముందుకు వస్తేనే ఆదరణ దక్కుతుందని కూడా అంటున్నారు. మరి ఇవన్నీ చూసుకోకుండా కేవలం యాంటీ ఇంకెంబెన్సీ తోనే అధికారం లోకి వస్తామనుకుంటే బూమరాంగ్ అవుతుందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి వైసీపీ ధీమా వెనక ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయో.