రేవంత్ ధీమా అదేనట...బీఆర్ఎస్ మ్యాటరేంటో ?

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రతీ సభలోనూ మరో మూడు టెర్ములు కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరుతుందని చెబుతున్నారు.

Update: 2026-08-03 04:21 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ ఎక్కడ అన్నారు, అసలు గెలుస్తుందా అని కూడా అనుకున్నారు. అంతే కాదు వర్గ పోరు ఎక్కువగా ఉంది, ఎంతో మంది నేతలు ఉన్నారు అని కూడా చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీని వారే ఓడిస్తారు అని కూడా సెటైర్లు పేల్చారు. దానికి తోడు 2018 నుంచి 2023 మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ ఎక్కడా కనిపించలేదు, దాంతో కాంగ్రెస్ పని అయిపోయింది అని బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే అసలైన పోటీ అని కూడా విశ్లేషించారు.

రేసులోకి దూసుకు వచ్చి :

ఇక బీఆర్ఎస్ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీజేపీనే టార్గెట్ చేస్తూ రాజకీయంగా లేపే ప్రయత్నం చేశారు. ఈ విధంగా ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ఓట్లు చీలి బీఆర్ఎస్ మూడవసారి గెలిస్తుంది అని గులాబీ పార్టీ పెద్దలు అంచనా వేసారు. కానీ జరిగింది వేరు, బీఆర్ఎస్ యాంటీ ఓటింగ్ అంతా పోలరైజ్ అయి నేరుగా కాంగ్రెస్ కే దక్కింది. ఆ విధంగా చేయడంలో కాంగ్రెస్ ని ముందు వరసలో పెట్టడంతో పాటు పార్టీ గెలుస్తుంది అని జనాల విశ్వాసం పొందడంలో రేవంత్ రెడ్డి చురుకైన నాయకత్వం బాగా పనిచేసింది. పైగా తానే కేసీఆర్ కి అసలైన ఆల్టర్నేషన్ అని ఆయన గట్టిగానే చాటుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లో ఎంతో మంది అగ్ర నేతలు ఉన్నా అందరినీ కో ఆర్డినేట్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. గడచిన ముప్పయి నెలలుగా ఆయన తనదైన శైలిలో పాలిస్తున్నారు.

మూడు టెర్ములు అంటూ :

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రతీ సభలోనూ మరో మూడు టెర్ములు కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరుతుందని చెబుతున్నారు. పార్టీ మీటింగులలో చెబితే అది కార్యకర్తలకు ఆత్మ విశ్వాసం పెంచడానికి అని అనుకోవచ్చు. కానీ ఇటీవల ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కూడా ఆయన అదే మాట అన్నారు. 2034 వరకూ నేనే ఉంటాను మీ బాగోగులు అన్నీ నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారు. దాంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్న రాజకీయ భరోసా మాత్రమే కాదని ఆయన ధీమా వెనక వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

గాలి మారుతోంది :

ఇక చూస్తే దేశవ్యాప్తంగా గాలి మారుతోంది. దేశంలో మెల్లగా బీజేపీకి వ్యతిరేక వాతావరణం ఏర్పడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ కి అది అంది వచ్చిన అవకాశంగా మారుతోంది. ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ అయితే 2029లో గెలిచి కేంద్రంలో పాగా వేస్తామని గట్టి నమ్మకంతో ఉంది. ఇక దక్షిణాదిన అయితే కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తోంది. తెలంగాణా కర్ణాటక, కేరళలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. దేశంలో రాజకీయ మార్పులు అంటూ జరిగితే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట అది మరింతగా అనుకూలించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అయితే ఈ రోజుకు బలంగా ఉంది. కాంగ్రెస్ బలం అంతా బలమైన లీడర్ షిప్ లో ఉంటుంది.

కాంగ్రెస్ అద్భుతాలనే సృష్టిస్తుంది :

స్వతహాగా కాంగ్రెస్ సముద్రమంత శక్తి కలిగిన పార్టీ. అయితే ఆ పార్టీని వర్గ పోరే ఇబ్బందుల్లో పెడుతుంది. ఏక నాయకత్వం ఉంటే కనుక కాంగ్రెస్ అద్భుతాలనే సృష్టిస్తుంది అని గతంలో అనేక సార్లు రుజువు అయింది. ఇపుడు ఆ లోటు రేవంత్ రెడ్డి తీరుస్తున్నారు. దాంతో దేశంలో ఎన్డీయే వ్యతిరేక పవనాలు మొదలైన వేళ 2028 ఎన్నికల నాటికి అవి మరింత బలోపేతం అవుతాయని కచ్చితంగా కాంగ్రెస్ కే అది విజయం దిశగా తీసుకుని వెళ్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఇక యువత గురించి కూడా ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్న యువత మరో బలమైన జాతీయ పార్టీగా కాంగ్రెస్ నే ఎంచుకుంటుందని కూడా ఊహిస్తున్నారు. మొత్తం మీద అదే కనుక జరిగితే మరోసారి కాంగ్రెస్ తెలంగాణాలో గెలవడం ఖాయమని అంటున్నారు. అపుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అన్నదే చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో

Tags:    

Similar News