ఆ సీటు వదలద్దు...కుమారుడికి ముద్రగడ చివరి మాట !
ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాపులే ఎప్పుడూ గెలుస్తూ ఉంటారు. ఇక ముద్రగడ కుటుంబం ఇక్కడ నుంచి అనేక సార్లు గెలిచింది.
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జూలై 14న మరణించారు. ఆయన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముద్రగడ ఆశయాలను నెరవేరుస్తామని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు గట్టిగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ముద్రగడ జీవించి ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ బలం వేరేగా ఉండేది అన్న చర్చ కూడా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఆయన పార్టీకి బలం సమకూర్చేవారు అని అంటున్నారు. పార్టీ ఇపుడు అదే సామాజిక వర్గం నుంచి వేరే నాయకులను ఆల్టర్నేషన్ గా తయారు చేసే పనిలో ఉంది. ఇక ముద్రగడ సిద్ధాంతాలకు ఆశయాలకు తాము వారసులమని ఆయన అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని కాపు నేతలు చెబుతున్నారు. ఇంకో వైపు ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు ముద్రగడ గిరి ఉన్నారు. ఆయనను కూడా ఎమ్మెల్యేగా చేసి చట్ట సభలలో చూడాలని ముద్రగడ తపన పడ్డారు. ఆయనకు 2029 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టికెట్ ఇప్పించుకోవాలని ఆలోచించారు.
ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు ప్రత్యేకత :
ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కాపులే ఎప్పుడూ గెలుస్తూ ఉంటారు. ఇక ముద్రగడ కుటుంబం ఇక్కడ నుంచి అనేక సార్లు గెలిచింది. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు ఇండిపెండెంట్ గా 1962, 1967లలో వరసగా రెండు సార్లు గెలిచారు. అలాగే ముద్రగడ పద్మనాభం 1978, 1983, 1985, 1989లలో వరసగా నాలుగు సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అంటే ముద్రగడ కుటుంబం నుంచి తండ్రీ కొడుకులు ఆరు సార్లు గెలిచిన సీటు అన్న మాట. అలాంటి ఈ సీటుని 1994లో ఓటమి చెందాక ముద్రగడ వదిలేసి వచ్చారు. అయితే ఆ సీటుని వదులుకోవడం వల్ల రాజకీయంగా ముద్రగడ మళ్ళీ ఎక్కడా అసెంబ్లీ నుంచి గెలవలేకపోయారు. ఆయన 2004, 2009, 2014లలో పిఠాపురం నుంచి వరసగా పోటీ చేసినా ఓటమి ఎదురైంది. అందుకే ఆయన ప్రత్తిపాడు నుంచే పోటీ చేయాలని తన కుమారుడికి చివరి రోజులలో సూచించారు అని అంటున్నారు.
నాన్న చెప్పారంటూ :
ఇక ఇటీవల ముద్రగడ కుమారుడు గిరి మీడియాతో మాట్లాడుతూ చివరి రోజులలో తన తండ్రి చెప్పిన మాటలు అన్నీ జీవిత కాలం పాటిస్తాను అన్నారు. తమ కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిన ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని తండ్రి సూచించారు అని గిరి చెప్పారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ముద్రగడ గిరి అక్కడ నుంచే పోటీ చేస్తారు అన్నది ఖాయం అయిపోయింది. ఈసరికే ఆయన ప్రత్తిపాడు అసెంబ్లీ సీటుకి వైసీపీ తరఫున ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు జగన్ కి ముద్రగడ మీద ఉన్న అభిమానంతో పాటు ఆయన వారసుడికి ఆ సీటుని కచ్చితంగా ఇస్తారని అంటున్నారు.
వర్గ పోరు ఉంది :
అయితే ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు ఉంది అని అంటున్నారు. 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు ఇక 2024లో వరుపుల సుబ్బారావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో పర్వత వర్గం సహకరించలేదని చెబుతారు. ముద్రగడ కుమారుడు గిరికి ఈ వర్గాలు సహకరిస్తాయా అన్నది చర్చగా ఉంది. అయితే ముద్రగడ మీద పెద్ద ఎత్తున సానుభూతి అయితే ఇప్పటికే నియోజకవర్గంలో ఉంది అని అంటున్నారు. దాంతో ఆయన గెలుపు ఖాయమని ముద్రగడ అభిమానులు చెబుతున్నారు.