రాజకీయాల్లోకి కాక్రోచ్...కీలక భేటీ ?
ఇదిలా ఉంటే సీజేపీ వ్యవస్థాపకుడు అయిన అభిజిత్ దీప్కే ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లోని ఆయన నివాసంలో కీలక భేటీని ఏర్పాటు చేశారు.
కాక్రోచ్ అని సెటైరికల్ గా అన్నా కూడా ఆ పేరుతో పుట్టిన వాట్సప్ పార్టీకి అన్నీ శుభ శకునములు అన్నట్లుగా హవా బాగానే సాగుతోంది. కేవలం రెండున్నర నెలల కాలంలోనే కాక్రోచ్ జనతా పార్టీ దేశమంతటా చర్చించుకునేలా చేసింది. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించింది. బలమైన కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టి తమ డిమాండ్లు సాధించుకుంది. ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా యువత గురించే ఆలోచించేలా చేయడం కూడా సీజేపీ విజయం అని అంటున్నారు. మరి ఇన్ని విధాలుగా రాజకీయ ప్రకంపనలకు కారణం అయిన సీజేపీ తాను కూడా రాజకీయ అవతారం ఎత్తకుండా ఉంటుందా అంటే ఉండదనే రాజకీయం గురించి తెలిసిన వారు చెబుతారు. ఇపుడు సీజేపీ అడుగులు కూడా వడివడిగా ఆ దిశగానే పడుతున్నాయని అంటున్నారు.
అభిజిత్ కీలక భేటీ :
ఇదిలా ఉంటే సీజేపీ వ్యవస్థాపకుడు అయిన అభిజిత్ దీప్కే ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లోని ఆయన నివాసంలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో అత్యంత కీలకమైన సంచలనమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతానికి సీజేపీగా ఉన్నా అది ఉద్యమ సంస్థగానే పేర్కొంటున్నారు. తొందరలో రాజకీయ పార్టీగా అవతరించేందుకు అన్ని అవకాశాలను సీరియస్ గానే పరిశీలించాలని ఈ భేటీలో ఆలోచిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ మీద సీజేపీ చేపట్టిన ఉద్యమం ఘన విజయం సాధించి దాని ప్రభావం దేశం నలుమూలలా వ్యాపించడంతో సీజేపీ మీద కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాంతో సీజేపీ రాజకీయ పార్టీగా తన రూపు మార్చుకుంటుందని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
కోర్ కమిటీ సభ్యులతో :
ఇక అభిజిత్ దీప్కే నివాసంలో ఈ నెల 5న జరిగే అత్యంత కీలక భేటీకి సీజేపీ కోర్ కమిటీ సభ్యులను ఆహ్వానించారు అని అంటున్నారు. వీరితో సీరియస్ గా సుదీర్ఘంగా చర్చించిన మీదట సీజేపీని ఉద్యమ సంస్థగా ఉంచాలా లేక రాజకీయ పార్టీగా కొత్త రూపునకు తీసుకుని రావాలా అన్నది నిర్ణయిస్తారు అని అంటున్నారు. ఇక అభిజిత్ దీప్కే అయితే ప్రస్తుతం దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీల నేతలతో సమానంగా ఆదరణ పొందుతున్నారు. ఆయన జెన్ జీ ఐకాన్ గా కూడా గుర్తింపు పొందారని అంటున్నారు.
భవిష్యత్తు కార్యాచరణ :
ఇక కోర్ కమిటీ సభ్యులంతా కలసి రాజకీయ పార్టీగా సీజేపీని మార్చాలా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న మీదట దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న సీజేపీ మద్దతు దారుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తారు అని అంటున్నారు ఆ మీదటనే పూర్తి స్థాయిలో సీజేపీ రాజకీయ అవతారం ఎత్తవచ్చు అని అంటున్నారు. ఇక సీజేపీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదని అలాగే ఏ పార్టీతో విలీనం కూడా కాదని ఇప్పటికే అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.
విద్యార్థుల గొంతుకగానే :
అయితే సీజేపీ ఉద్యమ సంస్థగా విద్యార్ధుల యువత గొంతుకగా ఉంటేనే విలువ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. రాజకీయ పార్టీగా కనుక రూపాంతరం చెందితే కనుక పాల పొంగులా ఆదరణ కరిగిపోతుందని అంటున్నారు. అంతే కాదు విద్యార్ధుల సమస్యల మీదనే ఎక్కువ మంది యువత మద్దతు ఇచ్చిందని సీజేపీ రాజకీయ పార్టీగా మారితే వారి నుంచి మద్దతు పూర్తి స్థాయిలో ఆశించడం కష్టమే అని అంటున్నారు. అయితే ఆగస్టు 5న సీజేపీ కీలక భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ నిర్ణయాన్ని అభిజిత్ దీప్కే మీడియాకు తెలియచేస్తారు అని అంటున్నారు.