ఉప్పొంగే గోదావరి నీరు...ఉప్పు సముద్రం పాలు !
ఇదిలా ఉంటే భారతదేశంలో 400లకు పైగా నదులు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి అత్యంత ప్రధానమైనవి.
ఒక వైపు సూపర్ ఎల్ నినో మరో వైపు చూస్తే ఆకాశం నుంచి వస్తే బీభత్సమైన వర్షం లేకపోతే చుక్క నేల రాని వైనం. ఈ పరిస్థితుల్లో ప్రతీ నీటి బొట్టూ ప్రాణాధారం గానే ఉంటోంది. నీటి కటకట చూస్తే ఏపీలో అంతటా ఉంది. అలాగే దేశంలో ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాలలో ఉంది. నీరు లేకపోతే మనిషి మనుగడకే ముప్పు అన్నది తెలిసిందే. అలాంటి నీరు వృధాగా సముద్రంలోకి కలసి పోతుంటే ఏమనుకోవాలి. ఎనిమిది పదుల స్వాతంత్ర్య భారతావనిలో నదీ జలాలు సాగరం పాలు కాకుండా అవసరం అయిన నీటిని ఒడిసి పట్టుకుని ప్రాజెక్టులు కట్టుకోవడంలో మనం వైఫల్యం చెందామన్న సంగతి గలగలా పారుతూ గోదావరమ్మ సాగరుడిలో లీనం అయిపోతున్న తీరు చాటి చెబుతోంది.
భారీ వర్షాలతో వరదలు :
ఎగువన భారీగా వానలతో గోదావరికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. దాంతో దిగువకు వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. అలా గోదావారి వరదల వల్ల ఇప్పటిదాకా ఈ వర్షాకాలం గోదావరి నుంచి సగటున రోజుకు 130 టీఎంసీల నీరు వచ్చి ఏకంగా సముద్రంలో కలసిపోతోంది. ఆ విధంగా ఇప్పటికి 500 టీఎంసీల దాకా నేరు సముద్రంలో కలవడం విశేషం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం సమీపంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతంపై గోదావరి నది జన్మించింది. అలా ఈ నది అన్నీ దాటుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సుమారు ఒక వేయి 465 కిలోమీటర్ల పొడవుతో దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నదిగా ఉంది. అలా చివరికి ఆంధ్రాకు చేరి రాజమండ్రి వద్ద అఖండ గోదావరిగా మారి బంగాళాఖాతంలో కలుస్తోంది. మూడు రాష్ట్రాలకు గోదావరి మీద హక్కులు ఉన్నాయి. అయితే ఏడాది పొడవునా గోదావరి నది నుంచి నీళ్ళు వస్తున్నా ఇంత పెద్ద ఎత్తున గోదావరి నది నీరు ఉంటే దానిని ఉపయోగించుకోకపోవడం పాలకుల వైఫల్యమే అని అంటున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం లేని లోటు :
మహారాష్ట్రను పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు నీరు చాలా అవసరం. ముఖ్యంగా గోదావరి నీటి కోసం వివాదాలు రచ్చ చేస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద ఎత్తున నీరు అందించే జీవ నదిని సక్రమంగా ఉపయోగించుకునే భారీ ప్రాజెక్టులను నిర్మించుకోలేకపోతున్నారు అని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారు. ఇక తెలంగాణలో చూస్తే అక్కడి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కూడా గోదావరిలో కలిసాక అతి పెద్ద ప్రాజెక్ట్ గా పోలవరం తప్పించి మరోటి లేదు. అది కూడా ఈనాటికి పూర్తి కాకపోవడం వల్లనే గోదావరి జలాలను వరద సమయంలో స్టోరేజ్ చేసుకుని వాడుకునే వీలు ఆంధ్రాకు లేకుండా పోయింది అని అంటున్నారు.
దేశంలోని నదులు ఎన్ని :
ఇదిలా ఉంటే భారతదేశంలో 400లకు పైగా నదులు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి అత్యంత ప్రధానమైనవి. దేశంలో మొత్తం వార్షిక నదీ ప్రవాహం సుమారు 1,869 బిలియన్ క్యూబిక్ మీటర్లు లేదా దాదాపు 1,900 ఘన కిలోమీటర్లుగా అంచనాగా నిపుణులు అంచనా వేశారు. 1,900 ఘన కిలోమీటర్లు అంటే సుమారు 67,098 టీఎంసీలకు సమానం అన్న మాట. అదే విధంగా దేశంలో 12 ఇతర ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అనేక మధ్యతరహా చిన్న తరహా నదులు ఉన్నాయి.
సముద్రంలోనే విలీనం :
ఇక దేశంలో పొడవైన నదులుగా ఉన్నవి చూస్తే గంగా నది పొడవు 2,525 కిలో మీటర్లు ఉంది. అలాగే గోదావరి నది పొడవు 1,465 కిలోమీటర్లుగా ఉంది. బ్రహ్మపుత్ర నది పొడవు 2,900 కిలోమీటర్లుగా ఉంది. దేశంలో వర్షాలు నదుల ద్వారా లభించే మొత్తం నీటి ప్రవాహం దాదాపు 1,869 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఇందులో భౌగోళిక సాంకేతిక పరిమితుల కారణంగా దేశం మొత్తం మీద సుమారు 1,123 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. మరి నీటి లభ్యత ఉన్నా ఒక వైపు కరవు తాండవిస్తోంది. మరో వైపు వరదలు ముంచెత్తున్నాయి. వీటికి పరిష్కారం లభించాలి అంటే దేశంలోని నదుల అనుసంధానం మార్గం అని మేధావులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైన చోట నీటి ప్రాజెక్టులు నిర్మించాలని సూచిస్తున్నారు.