ఉత్త‌రాంధ్ర వార‌సులు.. పొలిటిక‌ల్ అవ‌కాశాలు.. !

రాజకీయాల్లో వారసత్వాలకు కొరత, కొదవలేదు. సీనియర్లు తమ కుటుంబాల నుంచి నాయకులను పరిచయం చేస్తున్నారు.;

Update: 2026-05-04 23:30 GMT

రాజకీయాల్లో వారసత్వాలకు కొరత, కొదవలేదు. సీనియర్లు తమ కుటుంబాల నుంచి నాయకులను పరిచయం చేస్తున్నారు. యువ నేతలు కూడా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. టికెట్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే యువ నేతలు ఉత్సాహంగానే రాజకీయాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు .ఈ క్రమంలో రాయలసీమ నుంచి ఎక్కువ మంది యువ నేతలు కనిపిస్తుండగా.. అదే స్థాయిలో ఉత్తరాంధ్ర నుంచి కూడా యువ నేతలు రాజకీయ రంగ ప్రవేశం ఇప్పటికే చేశారు. మరి కొందరు రెడీగా కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎంతమంది ప్రజలను ఒప్పించగలరు.. మెప్పించగలరు.. ఓటు బ్యాంకును సాధించగలరు.. అనే విషయాలు ఎటు తేలడం లేదు. గత ఎన్నికల్లోనే ఒకరిద్దరు సీనియర్ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపాలని భావించారు.

కానీ, పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు వైసిపి ఇటు టిడిపి కూడా వారసులకు టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారసులు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఖచ్చితంగా తమ వారసులను బరిలో నెలపాలని సీనియర్లు ఇప్పటినుంచే పట్టుబడుతున్నారు. తమ పిల్లలను నియోజకవర్గాల్లోకి దింపేశారు కూడా. ఇలాంటి వారిలో ఉమ్మడి విశాఖపట్నంలోని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల విజయ్ దూకుడుగా ఉన్నారు. ఈయన పార్టీలో సీనియర్ యువనేతగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ దీనికి ముందు కూడా ఆయన యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయ్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన తండ్రి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పట్టుబడుతున్నారు. పైగా లోకేష్ టీం లో ఉన్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది. దీంతో ఖచ్చితంగా విజయ్‌కు టికెట్ లభించటం ఖాయమని అంటున్నారు. ఇక స్థానికంగా ఉన్న రాజకీయాలను గమనిస్తే చింతకాయల విజయ్ కు యువత ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ప్రజల్లోనూ అయ్యన్నపాత్రుడుకు ఉన్న సానుభూతి.. వారికి ఉన్న రాజకీయ వర్గం విజయ్‌కు అనుకూలంగానే మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆయన విజయం సాధించడం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస‌ నియోజకవర్గం నుంచి ఈ దఫా తమ్మినేని చిరంజీవి కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన తండ్రి అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘంటాపదంగా చెబుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే చిరంజీవి నాగ్‌కు టిక్కెట్టు ఇవ్వాలని సీతారాం పట్టుబట్టారు. కానీ.. అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోవడంతో జగన్ ఈ విషయాన్ని పక్కనపెట్టి సీతారామ్‌కే టికెట్ కేటాయించారు. కానీ ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నందున వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాగ్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని సీతారాం తేల్చేశారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ టికెట్ ఖాయమనే చర్చ నడుస్తోంది.

ఇక చిరంజీవి రాజకీయాలను చూసుకుంటే గత రెండు ఎన్నికల్లో కూడా తండ్రి తరఫున ఆయన ప్రచారం చేశారు. యువతను ఆకట్టుకునే లాగా వ్యవహరించారు. ముఖ్యంగా ఐటి రంగంలో అనుభవం ఉన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేయడం విశేషం. తరచుగా సోషల్ మీడియాలో ఆయన అనేక పోస్టులు పెడుతూ ఉంటారు. యూట్యూబ్ లో చానల్స్ కూడా నడుపుతారు. దీంతో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతారు. ఇది వచ్చే ఎన్నికల్లో చిరంజీవికి కలిసివచ్చే అంశం అని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో యువ నాయకుడు కిడారి శ్రావణ్ కుమార్ 2014లో వైసిపి తరఫున అరకు నుంచి పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు తర్వాత కాలంలో టిడిపిలోకి వచ్చారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని కూడా చర్చ నడిచింది. ఇంతలోనే మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సర్వేశ్వరరావు మృతి చెందారు. అనంతరం ఆయన వారసుడిగా కిడారి శ్రావణ్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. నిజానికి అప్పటికి అటు అసెంబ్లీకి కానీ ఇటు శాసన మండలికి కానీ శ్రావణ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడం లేదు. అయినప్పటికీ ఆరు మాసాల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు.

తర్వాత 2019 ఎన్నికల్లో అదే అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు టిడిపి టికెట్ ఇచ్చింది. కానీ వైసీపీ హవాతో పాటు జగన్ పాదయాత్ర కారణంగా శ్రావణ్ కుమార్ పరాజయం పాలయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయనకు డిపాజిట్ దక్కలేదని కూడా ప్రచారంలో ఉంది. గత ఎన్నికల విషయానికి వచ్చేసరికి అసలు పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. అంతర్గతంగా చేయించిన సర్వేలు పార్టీ సీనియర్ నాయకులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఈ టికెట్ను మిత్రపక్షమైన బిజెపికి కేటాయించారు. ఇక వచ్చే ఎన్నికల నాటికైనా కిడారి శ్రావణ్‌కు టికెట్ దక్కుతుందా లేదా అనేది చూడాలి.

ప్రస్తుతం అయితే ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో యువతను ఆకర్షించే దిశగా కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి టికెట్ విషయంలో పార్టీ నుంచి ఇంకా ఎటువంటి హామీ లభించలేదు. ఆయన చేసే పనితీరు, పార్టీలో వ్యవహరించే విధానాలు, పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే అంశాలను పరిగణన‌లోకి తీసుకున్న తర్వాతే టికెట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని స్థానిక టిడిపి నేతలు చెబుతున్నారు. సో ఇలా కొంతమంది యువ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి.

Tags:    

Similar News