షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి.. షాకింగ్ వీడియో!

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ లో అలాంటి ఒక సంఘటన జరిగింది. ఇందులో భాగంగా... 25 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి.. కాక్ తీసుకోవడానికి వంగిన కొన్ని క్షణాల తర్వాత అకస్మాత్తుగా కోర్టులో కుప్పకూలిపోయాడు.;

Update: 2025-07-28 13:20 GMT

ఇటీవల కాలంలో డాన్స్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, కుర్చీలో కూర్చుని సేదతీరుతూ కూడా అకస్మత్తుగా గుండెపోటుకు గురై చాలా మంది వ్యక్తులు మృతి చెందిన ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కారణం కరోనా వైరస్ అనే చర్చా నడిచింది. ఇటీవల దీనిపై ఐ.సీ.ఎం.ఆర్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో షటిల్ ఆడుతూ 25 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో ప్రధానంగా యువకులు ఉన్నపలంగా గుండె పోటుతో మృతి చెందుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ లో అలాంటి ఒక సంఘటన జరిగింది. ఇందులో భాగంగా... 25 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి.. కాక్ తీసుకోవడానికి వంగిన కొన్ని క్షణాల తర్వాత అకస్మాత్తుగా కోర్టులో కుప్పకూలిపోయాడు.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా హైదరాబాద్‌ లోని నాగోల్ ప్రాంతంలోగల ఒక ప్రైవేట్ షటిల్ కోర్టులో ఆడుతున్నాడు గుండ్ల రాకేష్ (25) అనే వ్యక్తి. అతడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అతడు షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

దీంతో... సహచరులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ డిప్యూటీ సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తించారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సమయంలో... యువకుడిగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆకస్మిక మరణం.. ఆటలు ఆడటం, జిమ్‌ చేయడం వంటి శారీరక శ్రమల సమయంలో యువతలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన మరోసారి మొదలైంది. దీంతో... గుండె జబ్బుల లక్షణాలు ముందస్తుగా గుర్తించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా... కోవిడ్ తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు.. ప్రధానంగా 40 ఏళ్ల లోపు వారు కూడా కార్డియాక్‌ అరెస్ట్‌ తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిన సంగతి తెలిసిందే! దీనికంతటికీ కరోనా వ్యాక్సినే కారణమనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌), ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఇటీవల పరిశోధనలు చేపట్టాయి. ఈ సందర్భంగా.. పలు కీలక విషయాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగా... ఈ ఆకస్మిక మరణాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లు కారణం కాదని.. ఆ మరణాలకూ, ఈ వ్యాక్సిన్ కూ ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాల్లో తేలినట్లు స్పష్టం చేశాయి. ఆయా వ్యక్తుల ఆకస్మిక మరణాల్లో మునుపటి అనారోగ్య సమస్యలు, జీవనశైలి ప్రభావమే కీలక అంశమని పేర్కొన్నాయి.

Tags:    

Similar News