వైసీపీ వర్సెస్ టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది.. ?
రాష్ట్రంలో గత ఎన్నికలు ముగిసి.. 20 మాసాలు అయింది. దీంతో అధికార పార్టీ టీడీపీ.. ప్రతిపక్షం వైసీపీ ల పరిస్థితిపై చర్చ సాగుతోంది.;
రాష్ట్రంలో గత ఎన్నికలు ముగిసి.. 20 మాసాలు అయింది. దీంతో అధికార పార్టీ టీడీపీ.. ప్రతిపక్షం వైసీపీ ల పరిస్థితిపై చర్చ సాగుతోంది. వైసీపీ గ్రాఫ్ పుంజుకుందని ఆ పార్టీ నాయకులు తరచుగా చెబుతున్నారు ఇక, మాజీ సీఎం జగన్ అయితే.. తాము అధికారంలోకి వచ్చేస్తామని కూడా అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. తమదే విజయమని అంటున్నారు. మరోవైపు.. ప్రజలకు ఎన్నో చేస్తున్నామని.. వారి సంతృప్త స్థాయిలు కూడా బాగున్నాయని సీఎం చంద్రబాబు అంటున్నారు.
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నది టీడీపీచెబుతున్న మాట. ఇదేసమయంలో వైసీపీకి యాంటీ ప్రచారం కొనసాగుతూనే ఉంది. తిరుమల లడ్డూ నుంచి మద్యం అక్రమాలు, జగనన్న ఇళ్లు.. నాయకుల అవినీతి.. రప్పా రప్పా.. ఇలా అనేక విషయాలను టీడీపీ ప్రస్తావిస్తోంది. తద్వారా.. ఒకవైపు తమ పాజిటివి టీని పెంచుతూనే.. మరోవైపు.. వైసీపీని డైల్యూట్ చేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ గ్రాఫ్ నిజంగానే పెరిగిందా? లేక.. పైకి చెబుతున్నమాటేనా? అన్నది ప్రశ్న.
క్షేత్రస్థాయిలో వైసీపీపై ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ థింకింగ్ ఉంది. అదే.. వైసీపీ ఉండి ఉంటే.. తమకు ఏదో ఒక రూపంలో పథకాలు చేరువ అయ్యేవని.. తమ చేతిలో సొమ్ములు కనిపించేవని మెజారిటీ మహిళలు.. ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకుమించి వైసీపీకి పాజిటివిటీ ఏమీ కనిపించడం లేదు. అయితే.. టీడీపీ తరచుగా సూపర్ సిక్స్‌ను ప్రస్తావిస్తూ.. ఈ వాదనను తుడిచేందుకు ప్రయత్నిస్తోంది. తాము కూడా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామనిచెబుతోంది.
టీడీపీ చెబుతున్నది వాస్తవమే అయినా.. సంక్షేమ పథకాల అమలులో నెలల తరబడి గ్యాప్ వచ్చింది. పైగా.. ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి కీలక పథకాలను నేరుగా కాలేజీలకు ఇస్తున్న నేపథ్యంలో ఈ సొమ్ము పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. అదే సమయంలో 45 ఏళ్లు నిండిని బీసీలకు చేయూత అందించిన వైసీపీ నిరంతరం ప్రచారం చేసుకుంది. ఇది ఇప్పుడు ఇవ్వకపోవడం ఒక్కటే టీడీపీకి మైనస్ అవుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. పాలన పరంగా టీడీపీకి మంచి మార్కులు పడుతున్నా.. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా సంక్షేమాన్ని అమలు చేసే విషయంలో నిరంతరం ప్రజలను సంతృప్తి పరచాల్సి రావడం గమనార్హం.