నిబంధన చట్రం.. వైసీపీకి మేలు.. !
వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదు. సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు సభకు ఇలా వచ్చి.. ఎవరూ లేకుండా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు.;
వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదు. సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు సభకు ఇలా వచ్చి.. ఎవరూ లేకుండా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. అదే సమయంలో లిఖిత పూర్వక ప్రశ్నలు సంధించి.. సభలో తాము లేకున్నా..పలు అంశాలపై చర్చకు వచ్చేలా చేస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టాలి. వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించాలి!. - ఇదీ... ప్రస్తుతం ప్రభుత్వాన్ని.. మరోవైపు అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కలవరపరుస్తున్న అంశాలు.
అయితే.. ఏం చేయాలన్న విషయం పైనే ఇప్పుడు అసెంబ్లీ, ప్రభుత్వం కూడా తర్జన భర్జన పడుతోంది. ఏ చిన్న అవకాశం లభించినా.. వైసీపీ సభ్యులపై వేటు వేయాలన్నది వ్యూహం. కానీ, అలా సాధ్యం కావడం లేదు. ఎక్కడా ఏది చూసినా.. నిబంధనలు.. వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. సభకు రానంత మాత్రాన.. జీతాలు ఆపాలని ఎక్కడా లేదు. అంతేకాదు.. సభకు రాకపోయినా.. ఒక సభ్యుడు లిఖిత పూర్వకంగా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కూడా రాజ్యాంగంలో ఉంది.
అందుకే.. తొలినాళ్లలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. సభకు రాకుండా లిఖిత పూర్వ ప్రశ్నలు అడిగే వారిని ఎంటర్ టైన్ చేయబోమని చెప్పారు. కానీ, ఆయనకు అధికారులు నిబంధనలు చూపించే సరికి మౌనంగా ఉండిపోయారు. ఇక, సభకు రాకుండా తాడేపల్లిలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టే జగన్‌పై అనర్హత వేటు వేయాలని ఉంది. కానీ, అది కూడా సాధ్యం కావడం లేదు. కావాలంటే ఉప ఎన్నికకు వెళ్లే అవకాశం మాత్రమే రాజ్యాంగం కల్పించింది. ఇది ఎలానూ చేయరు. దీనివల్ల ప్రయోజనం లేదు.
ఇక, సభకు రాకుండా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారన్నది మరో కీలక అంశం. అయితే.. ఈ విషయం కూడా.. నిబంధనల చట్రంలో ఎక్కడా లేదు. సభ్యులు సంతకం చేశారంటే.. నిజంగానే వారు ఇలా చేసినా.. ప్రశ్నించేందుకు స్పీకర్‌కు అధారిటీ లేదన్నది నిబంధనలే చెబుతున్నాయి. అంతేకాదు.. సభకు వచ్చినట్టుగానే లెక్కించాలి. పోనీ.. అసలు రిజిస్టర్లు అందుబాటులో ఉంచకుండా చేయాలని అనుకున్నా.. అది కూడా సాధ్యం కావడం లేదు. ఇలా.. నిబంధనల చట్రం వైసీపీకి అనుకూలంగా ఉందన్నది అసెంబ్లీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో దీనిని రాజకీయంగా నే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. తద్వారా వైసీపీపై ఉన్న సానుకూలతను మరింత తగ్గించే ప్రయత్నం చేయనున్నారు.