రెజ్లింగ్‌ లెజెండ్‌ 'హల్క్‌ హోగన్‌' మృతి... షాకింగ్ రీజన్!

అవును... రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ మృతి చెందారు. ఆయన మరణానికి కార్ణం గుండెపోటు అని వైద్యులు ధృవీకరించారు.;

Update: 2025-07-25 04:16 GMT

అమెరికన్ రెజ్లర్, రెజ్లింగ్ లెజెండ్ హల్క్‌ హోగన్‌ మృతి చెందారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో మరణించారు. 71ఏళ్ల హోగన్‌ తీవ్ర అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే వైద్య బృందాలు క్లియర్‌ వాటర్‌ లోని ఆయన నివాసానికి చేరుకున్నాయి. అనంతరం.. అంబులెన్సులో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

అవును... రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ మృతి చెందారు. ఆయన మరణానికి కార్ణం గుండెపోటు అని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ సందర్భంగా... డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ సోషల్ మీడియా వేదికగా హల్క్ హోగన్ మరణాన్ని ధృవీకరించింది. రెజ్లర్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన సంతాపాన్ని తెలియజేసింది.

హల్క్‌ హోగన్ అసలు పేరు టెర్రీ జీన్ బొలియా. అమెరికాలోని జార్జియాలో 1953 ఆగస్టు 11న జన్మించిన ఆయన.. అంతర్జాతీయ రెజ్లర్‌ గా ఎదగడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆ ఆటకు ఎంతో ప్రాచుర్యం కల్పించారని చెప్పొచ్చు. 1980, 90లలో ప్రముఖ స్టార్‌ లలో ఒకరిగా నిలిచిన ఆయన.. తనదైన ఆహార్యంతో ఉర్రూతలూగించారు.

వాస్తవానికి హోగన్ తొలి రెజ్లింగ్ రోజులు 1970ల చివరలో ప్రారంభమయ్యాయి కానీ.. 1983లో విన్స్ మెక్‌ మహాన్ వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ లో చేరిన తర్వాత అతని కెరీర్ ఒక గొప్ప మలుపు తీసుకుంది. హోగన్ వీరోచిత వ్యక్తిత్వం, దేశభక్తి ప్రోమోలు, ఫిట్ నెస్ కారణంగా అతని ప్రజాదరణ పెరిగింది. ఈ క్రమంలో... తన కెరీర్‌ లో ఎన్నో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లను కైవసం చేసుకున్నారు.

అనంతరం.. 1984లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ లో 'ది ఐరన్ షేక్‌'ను ఓడించడం ద్వారా హోగన్ తన మొదటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌ షిప్‌ ను గెలుచుకున్నాడు. ఈ విజయం "హల్క్‌ మానియా" ప్రారంభానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఆ సమయంలో... రెజ్లింగ్ ల్యాండ్‌ స్కేప్‌ ను హోగన్ శాసించాడు. అతని మ్యాచ్‌ లు ప్రధాన ఈవెంట్‌ లుగా మారాయి.

ఇక... గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కు మద్దతు ప్రకటించిన హోగన్‌.. ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలో... ఓ ప్రచార కార్యక్రమంలో షర్ట్ తీసి, టీషర్ట్ చించుకుంటూ ఉద్రేకంగా ప్రసంగించడం అక్కడున్న వారందర్నీ ఆకర్షించింది. ఆయన ప్రసంగం తర్వాత ఇతర సభ్యులతో పాటు ట్రంప్‌ కూడా నిల్చొని చప్పట్లతో హోగన్‌ ను అభినందించారు.

కాగా... కొన్ని వారాల క్రితం హోగన్ కోమాలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... ఆ వార్తలను ఆయన సతీమణి స్కై డైలీ (45) ఖండించారు. ఈ సందర్భంగా... ఆయనకు ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని, దాని నుంచి కోలుకుంటున్నారని, ఆయన గుండె చాలా దృఢమైనదంటూ అభిమానులను ఉద్దేశించి ఆమె ప్రకటించారు.

Tags:    

Similar News