తెలంగాణలో 3 పార్టీలు.. 51 మంది.. మహిళలు 12 శాతమే.. గతం కంటే తక్కువ

తెలంగాణ ఏర్పాటు ఖరారయ్యాక మూడోసారి లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2024-04-27 13:30 GMT

తెలంగాణ ఏర్పాటు ఖరారయ్యాక మూడోసారి లోక్‌ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 ప్రధాన పార్టీలు (బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్) అన్ని సీట్లలో పోటీ చేస్తుండడం గమనార్హం. అది కూడా ఎలాంటి పొత్తులు లేకుండా. వీరి నుంచి 51 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అయితే, ఇందులో ఆరుగురే మహిళలు. శాతాల్లో చూస్తే కేవలం 12. మరోవైపు మహిళా అభ్యర్థులకు ప్రత్యర్థులుగా, అయా పార్టీలు పురుషులను బరిలో నిలిపాయి. ఆరుగురు మహిళల్లో ముగ్గురు రాజకీయాల్లో కొత్త ముఖాలు కావడం గమనార్హం.


ఆరుగురిలో ముగ్గురు రిజర్వుడ్ నుంచే

ఆరుగురు మహిళా అభ్యర్థుల్లో ముగ్గురు రిజర్వుడ్ (వరంగల్ (ఎస్సీ), ఆదిలాబాద్, మహబూబాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ తరఫున ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులను మినహాయిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల తరపున 51 మంది, హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోటీకి దిగుతున్నారు. 52 మంది ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మాలోత్ కవిత ఒక్కరే..

ఆరుగురు మహిళా అభ్యర్థుల్లో మాలోత్ కవిత (మహబూబాబాద్-బీఆర్ఎస్) మాత్రమే సిటింగ్ ఎంపీ. డీకే అరుణ (బీజేపీ, మహబూబ్ నగర్), మాధవీ లత (బీజేపీ-హైదరాబాద్), ఆత్రం సుగుణ (కాంగ్రెస్-ఆదిలాబాద్), సునీతా మహేందర్ రెడ్డి (కాంగ్రెస్-మల్కాజిగిరి), కడియం కావ్య (వరంగల్-కాంగ్రెస్) ఇప్పటివరకు ఎంపీలుగా నెగ్గలేదు. కావ్య, సుగుణ, మాధవీలత, పట్నం సునీత తొలిసారి పోటీ చేస్తున్నారు. డీకే అరుణ 2019లో బరిలో దిగి ఓడిపోయారు.

గతం కంటే తగ్గారు

2014లో 12 మంది మహిళలు తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీచేశారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత (నిజామాబాద్) ఉన్నారు. మిగిలిన వారు బీఎస్పీ, స్వతంత్రులు. ఇక 2019లో కల్వకుంట్ల కవిత సహా 25 మంది బరిలో దిగారు. మాలోత్ కవిత, రేణుకా చౌదరి (ఖమ్మం-కాంగ్రెస్), డీకే అరుణ (మహబూబ్ నగర్ –కాంగ్రెస్), బంగారు శ్రుతి (నాగర్ కర్నూల్) పోటీ చేశారు. ఇతర పార్టీలు, స్వతంత్రులను కలుపుకొంటే మొత్తం 25 మంది పోటీ చేశారు. కానీ, ఇప్పుడు ప్రధాన పార్టీల నుంచి ఆరుగురు లక్ ను పరీక్షించుకుంటున్నారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత అసలు ఎందరు బరిలో ఉన్నారనేది తెలుస్తుంది.

కొసమెరుపు: జాతీయ స్థాయిలో చూస్తే.. బీజేపీ 16 శాతం మహిళలకు, కాంగ్రెస్ 13 శాతం మహిళలకు టికెట్లిచ్చాయి. ఏపీలో ఈ రెండు పార్టీలు ఇద్దరేసి మహిళలను పోటీకి నిలిపాయి. తెలంగాణలో బీజేపీ ఇద్దరికి, కాంగ్రెస్ ముగ్గురికి టికెట్లిచ్చాయి.

Tags:    

Similar News