ప్రియుడి ఫ్యామిలీపై పెట్రోల్.. నిప్పు అంటిస్తూ మంటల్లో చిక్కుకొని మృతి
అక్కడ మల్లేష్ భార్యతో గొడవకు దిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గ.. విచక్షణ మరిచి తనతో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను.. మల్లేశ్ బార్య. తల్లి.. కొడుకుమీద పోసింది.;
ఈ ఉదంతం గురించి విన్నంతనే ‘చెడపకురా చెడేవు’ అన్న పాత సామెత గుర్తుకు రాక మానదు. తీవ్రమైన ఆగ్రహంతో ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసే ప్రయత్నంలో ఆ మంటల్లో చిక్కుకున్న మహిళ మరణించిన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. అసలేం జరిగిందన్న అంశానికి సంబంధించి స్థానికులు.. పోలీసు వర్గాలు చెబుతున్న వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన మల్లేష్ కు తెనాలికి చెందిన దుర్గతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వీరి సంబంధానికి ముందే దుర్గకు పెళ్లై.. ఒక కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శనివారం తెనాలిలో పంచాయితీ పెట్టారు. ఈ వ్యవహారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గ.. మల్లేశ్ గ్రామమైన సుద్దపల్లికి వెళ్లింది.
అక్కడ మల్లేష్ భార్యతో గొడవకు దిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గ.. విచక్షణ మరిచి తనతో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను.. మల్లేశ్ బార్య. తల్లి.. కొడుకుమీద పోసింది. తెనాలిలో ఉన్న మల్లేశ్ కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో వారికి నిప్పు అంటించే క్రమంలో ఆమె మీద పడ్డ పెట్రోల్ తో ఆమెకూ నిప్పు అంటుకుంది. మంటల్ని చూసిన ఇరుగుపొరుగు ఇంట్లోకి వచ్చి..మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంటల్ని అదుపు చేసేందుకు వచ్చిన ఆరుగురు స్థానికులకు గాయాలయ్యాయి.
అదే సమయంలో మంటల్లో చిక్కుకున్న దుర్గ తీవ్ర గాయాలపాలైంది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపట్టారు. మంటల్లో 80 శాతం కాలిపోయిన దుర్గ.. ఆదివారం కన్నుమూసింది. ఈ ఉదంతం గురించి మరో వాదన బలంగా వినిపిస్తోంది. పోలీసులు ఈ అంశం మీదా విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు.
ఈ విషాదానికి సంబంధించి ఆ వెర్షన్ ఏమంటే.. భర్తతో ఉన్న తేడాలతో అతనికి దూరంగా ఉంటోంది. అదే సమయంలో కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఇదే సమయంలో మల్లేశ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్లుగా దుర్గతో అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. కొద్దికాలంగా దుర్గకు, మల్లేశ్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మల్లేశ్ ఊరికి వెళ్లి.. వారి కుటుంబంతో ఆమె గొడవపడినట్లుగా చెబుతున్నారు.
ఆవేశంతో మల్లేశ్ కుటుంబంపై పెట్రోల్ పోసి.. నిప్పు అంటించే ప్రయత్నం చేయగా.. మంటల్లో దుర్గ చిక్కుకుంది. దీంతో ఆమెను.. గాయపడిన మిగిలిన వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ దుర్గ కన్నుమూసింది. అయితే.. తన కుమార్తె దుర్గది హత్యగా ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. తన కుమార్తెపై మల్లేశ్ కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపినట్లుగా ఆరోపిస్తున్నారు. పోలీసుల విచారణలో అసలేం జరిగిందో బయటకు వస్తుందని చెబుతున్నారు.