తేజస్ ప్రమాదంలో మరణించిన పైలట్ ఎవరు? ఫ్యామిలీ మాటేంటి?

దుబాయ్ లో నిర్వహిస్తున్న ఎయిరో షో -2025లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోవటం.. దాని పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మరణించటం తెలిసిందే.;

Update: 2025-11-22 03:57 GMT

దుబాయ్ లో నిర్వహిస్తున్న ఎయిరో షో -2025లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోవటం.. దాని పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ మరణించటం తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ ఎంతో అనుభవం ఉన్న పైలట్ గా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. అనుభవజ్ఞుడైన పైలట్ గా వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ కు భారత వైమానికి దళంలో అతడికి పేరుంది.

2009 డిసెంబరు 24న భారత వైమానిక దళంలో నియమితులైన అతను.. మిగ్ 21, సుఖోయ్ 30ఎంకేఐ వంటి యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం అతడికి ఉంది. ప్రమాదానికి ముందు అతను మూడో స్క్రాడ్రన్ తేజస్ విమానాల్నినడుపుతున్నాడు. క్రమశిక్షణకు.. అసాధారణమైన సేవా రికార్డు అతని సొంతం. సాధారణంగా ఎయిర్ షోలో పాల్గొనేందుకు ఎంపిక కావటమంటేనే అతను అత్యంత నైపుణ్యం కలిగిన అత్యుత్తమ పైలట్లలో ఒకడిగా చెప్పొచ్చు.

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా నాగురోటా బగ్వాన్ ప్రాంతానికి చెందిన నమాన్ష్ సయాల్.. తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. అతని భార్య కూడా భారతవాయుసేనలోనే పని చేస్తున్నారు. ఆమె కూడా వింగ్ కమాండర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉన్నారని.. దుబాయ్ ఎయిర్ షో ముగించుకొని హైదరాబాద్ కు వచ్చే కొడుకు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురై.. అతను మరణించటంతో వారున్న ప్రాంతం విషాదంలో నిండింది.

వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్.. సతీమణి ఇద్దరూ హైదరాబాద్ ఎయిర్ బేస్ లోనే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమయంలో సయాల్ సతీమణి కోర్సు నిమిత్తం కోల్ కతాలో ఉన్నట్లుగా చెబతున్నారు. అతని తల్లిదండ్రులు.. కుమార్తె మాత్రం హైదరాబాద్ లోని వారి అధికారిక క్వార్టర్స్ లో ఉన్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News