ఇప్పుడు అనంతపురంలో.. రేపు మరిన్నిచోట్ల అయితే ఏం చేస్తారు చంద్రబాబు?
ఆదివారం అనంతపురంలో తారక్ అభిమానులు చేపట్టిన ఆందోళన.. ఎమ్మెల్యే దగ్గుబాటి ఇంటి వద్ద నిర్వహించిన నిరసన.. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కు వచ్చిన సానుకూల స్పందనను కూటమి పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.;
వార్ 2 మూవీ విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు.. మంత్రి లోకేశ్ కు తాను వీర విధేయుడన్న బిల్డప్ తో అనవసర వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఉదంతాన్ని సరైన పద్దతిలో క్లోజ్ చేయకుండా నానబెట్టటం ఏపీ అధికార పార్టీకి అనవసర రచ్చకు అవకాశాన్ని ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆదివారం అనంతపురంలో తారక్ అభిమానులు చేపట్టిన ఆందోళన.. ఎమ్మెల్యే దగ్గుబాటి ఇంటి వద్ద నిర్వహించిన నిరసన.. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కు వచ్చిన సానుకూల స్పందనను కూటమి పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా బయటకు వచ్చిన ఆడియోలో ఉన్నది తన వాయిస్సే కాదని దగ్గుబాటి వివరణ ఇచ్చినా.. అదేమీ తారక్ అభిమానుల్ని సంత్రప్తి పరిచలేకపోయింది. వార్ 2 మూవీ విడుదలై ఇప్పటికి రెండు వారాలు దాటిపోయింది. ఎమ్మెల్యే దగ్గుబాటి చేసినట్లుగా చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యలపై తారక్ అభిమానులు అంతకంతకూ రగిలిపోతున్నారు. ఈ ఇష్యూలో తమకు న్యాయం జరగాలని భావిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతుంది.
ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి క్యాంప్ ఆఫీసు ముట్టడికి తారక్ అభిమానులు పిలుపును ఇవ్వటం.. దానికి ప్రతిగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావటం.. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకోవటం తెలిసిందే. జై ఎన్టీఆర్ అంటూ నినదించటమే కాదు.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ తీవ్రతను పెంచుతున్నారు.
ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటను.. పోలీసులు సమర్థంగా అడ్డుకోవటం సరే. దీన్ని అదే పనిగా సాగతీత ధోరణిలో పెంచి పెద్దది చేసే కన్నా.. ఈ వివాదంపై చంద్రబాబు కానీ.. మంత్రి లోకేశ్ కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ రోజు అనంతలో మొదలైన నిరసనలు.. రేపొద్దున రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పాకితే ఇబ్బందన్న విషయాన్ని గుర్తించరా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ తరహా వివాదాల్ని కంటిన్యూ కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నది మర్చిపోకూడదు. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే.. ఆయన చేత క్షమాపణలు చెప్పించటంతో పాటు తారక్ అభిమానుల్ని బుజ్జగించాల్సిన అవసరం ఉందంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి సర్కారు భిన్నమైనదన్న మాటలకు అనుగుణంగా చేతలు ఉండాల్సిన అవసరం ఉంది కదా?
ఆ విషయాన్ని కూటమి పెద్దలు ఎందుకు గుర్తించనట్లు? ఒకవేళ.. వైరల్ అయిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో నిజం కాకుంటే.. అందుకు బాధ్యులైన వారిని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరహా ఉదంతాలను నిర్లక్ష్యం చేయటం ద్వారా కూటమి సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసినట్లు అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.