‘గూగుల్’కి అడ్డుపుల్లలు.. చంద్రబాబు షాకింగ్ రియాక్షన్
ఐటీ పెట్టుబడులతో దూసుకుపోతున్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.;
ఐటీ పెట్టుబడులతో దూసుకుపోతున్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే మరిన్ని కంపెనీలు వస్తాయని తద్వారా నగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. దీంతో గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుని భూములు కేటాయించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం కేటాయించిన భూములను అడ్డుకునేందుకు కొందరు రైతుల పేర్లతో కోర్టులో కేసులు వేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేర్లతో వైసీబీ నేతలే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దురాగతానికి ఒడిగడుతున్నది ఎవరో గుర్తించాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించారు.
పింఛన్ల పంపిణీకి విజయనగరం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో కాసేపు ఆగారు. భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ కు భూముల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హదీంద్రప్రసాద్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రైతులకు రెట్టింపు పరిహారం చెల్లిస్తామని చెప్పామని, కానీ, కొందరు మరణించిన రైతుల పేర్లతో కోర్టులో కేసులు వేశారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో షాకైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది అభివృద్ధిని అడ్డుకునే చర్యగా భావించి తీవ్రంగా స్పందించారు. కోర్టులో తప్పుడు కేసులు వేసిన వారు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొన్నింటిని గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు, ఐఏఎస్ అధికారులు బినామీ పేర్లతో తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ బినామీల్లో ఒకరు చనిపోయిన అప్పారావు అనే రైతు పేరుతో కోర్టులో కేసు వేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఉద్దేశపూర్వకంగా భూ సమీకరణకు అవాంతరాలు సృష్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమిలి నియోజకవర్గం పరిధిలో తుర్లవాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 200 ఎకరాల భూములు కేటాయించింది.
అయితే రైతుల నుంచి భూమలను సేకరించే ప్రక్రియ కొలిక్కి రాగా, ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం రూ.17 లక్షలు చొప్పున చెల్లించాలని ముందుగా నిర్ణయించారు. అయితే రైతులు మరింత పరిహారం కోరడంతో అదనంగా మరో రూ.2.55 లక్షలు పెంచి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో భూ సేకరణ ఇబ్బందులు తొలగినట్లు ప్రభుత్వం ఊపిరిపీల్చుకున్న సమయంలో చనిపోయిన రైతుల పేర్లతో కేసులు దాఖలు కావడం అధికారులను షాక్ కు గురిచేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, భీమిలి మండలాల పరిధిలో వైసీపీ హయాంలో కొంద పెద్దలు, ఐఏఎస్ అధికారులు బినామీ పేర్లతో డీపట్టాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. కీలక పోస్టులో పనిచేసిన ఓ అధికారి కొందరు బినామీలతో కలిసి సుమారు 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి తన సన్నిహితుల పేర్లతో ఎస్సీల భూములను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం అడ్వాన్స్ గా ఎకరాకు రూ.3.5 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు.
వంద రోజుల్లో మిగిలిన డబ్బు చెల్లించేందుకు అంగీకారం కుదరగా, కూటమి ప్రభుత్వం అక్కడే గూగుల్ డేటా సెంటర్ కు భూములు కేటాయించడంతో కోర్టులో కేసులు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రైతుల నుంచి రూ.7 లక్షల చొప్పున భూములు కొట్టేద్దామని వైసీపీకి చెందిన ఆ నేతలు ప్లాన్ చేయగా, ప్రభుత్వం రూ.19.5 లక్షలు చెల్లించడంతో రైతులు ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. అయితే రైతులు తమతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా ప్రభుత్వానికి భూములు ఇస్తే తాము నష్టపోతామనే భావనతో అగ్రిమెంటు చేసుకున్న బినామీలు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.