డ్ర‌గ్స్ మాటేమో కానీ.. టీడీపీ, వైసీపీలు రోడ్డున ప‌డ్డాయి!

ఏపీలో కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ తీరానికి వ‌చ్చిన భారీ కంటెయిన‌ర్లో.. 25 వేల కిలోల డ్ర‌గ్స్ ల‌భించ‌డం.. రాజ‌కీయంగాసంచ‌ల‌నం సృష్టిస్తోంది

Update: 2024-03-22 14:30 GMT

ఏపీలో కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు విశాఖ తీరానికి వ‌చ్చిన భారీ కంటెయిన‌ర్లో.. 25 వేల కిలోల డ్ర‌గ్స్ ల‌భించ‌డం.. రాజ‌కీయంగాసంచ‌ల‌నం సృష్టిస్తోంది. దీనిని ఎన్నిక‌ల వేళ అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీలు రాజ‌కీయ వ‌స్తువుగా మార్చేశారు. మీ నిర్వాక‌మేన‌ని టీడీపీ అంటే.. అంతా మీవాళ్లే ఉన్నారంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత డ్ర‌గ్స్ కేసులో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి, టీడీపీకి మ‌ధ్య సంబంధం ఇదిగో అంటూ ఫొటోల‌తో స‌హా వైసీపీ ఉద్య‌మం చేస్తోంది.

బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఏకంగా 25 వేల కిలోలు సరకు చిక్కింది. సీబీఐ చెప్పిన వివారల‌ ప్రకారం బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి వచ్చిన ఎస్‌ఈకేయూ 4375380 నెంబర్ ఉన్న కంటైనర్‌లో సరకు గుర్తించారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ పేరుతో వచ్చిన ట్రక్‌లో డ్రగ్స్‌ ఉన్నట్టు తేల్చారు. కంటెయిన‌ర్ల‌లో వ‌చ్చిన బ్యాగ్‌లు చెక్‌ చేస్తే నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్, మెథాక్వలోన్ వంటి డ్రగ్స్ ఉన్నట్టు తేలింది.

అంతేకాదు.. ఇది ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన 'సంధ్య‌' ఆక్వా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. దీనికి డైరెక్టర్‌గా కూనం హరికృష్ణ, కంపెనీ ప్రతినిధులు గిరిధర్, పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్‌, భరత్‌కుమార్ గా తేలింది. వీరు చెప్పిన వివ‌రాల మేర‌కు.. రొయ్యల ఆహార తయారీకి మొదటి సారిగా దీన్ని తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే.. తాము డ్ర‌గ్స్‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. కానీ, కంటెయిన‌ర్ల‌లో మాత్రం డ్ర‌గ్స్ బ‌య‌ట పడ్డాయి.

ఇదీ రాజ‌కీయ ర‌చ్చ‌

ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెను ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. గంజాయి నుంచి ఇతర డ్రగ్స్ వరకు అన్ని వ్యాపారాల్లో వైసీపీ లీడర్లు పండిపోయారని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు దొరికిన కంటైనర్‌ కూడా వారిదేనని పేర్కొంది. బ్రిజిల్‌ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కాకినాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ప‌ర్యాట‌కుల‌ను ల‌క్ష్యం గా చేసుకుని వ్యాపారం చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇదే కామెంట్ చేశారు. వైసీపీ డ్ర‌గ్స్ మాఫియా కార‌ణంగా రాష్ట్ర‌ యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే భ‌యం వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు.

వైసీపీ పంచ్‌లు..

ప్రతిపక్షాల విమర్శలపై వైసీపీ విరుచుకుపడింది. తాజా కేసులో డ్రగ్స్‌లో దొరికిన వారంతా టీడీపీ నేతలేనని పేర్కొంది. టీడీపీ అంటే ''తెలుగు డ్రగ్స్ పార్టీ' అని సెటైర్లు వేస్తోంది. డ్రగ్స్‌లో వినిపిస్తున్న వారు టీడీపీ నేతలతో దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. "టీడీపీ అంటే ఇన్నాళ్లు స్కాంలు చేస్తున్న తెలుగు దొంగల పార్టీ అనుకున్నాం..! కానీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ అని నిన్న వైజాగ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడగానే తేటతెల్లమైంది. ఇలా ఫొటోలతో సహా అడ్డంగా దొరికిపోయాక ఇంకేం బుకాయిస్తా. " అని వైసీపీ ట్వీట్ చేసింది.

Tags:    

Similar News