రంగా నాడు మీదనే అందరి చూపూ ! ..
ఇప్పటికి దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం కాపునాడు పేరుతో తొలి సభను వంగవీటి మోహన రంగారావు నిర్వహించారు.;
ఇప్పటికి దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం కాపునాడు పేరుతో తొలి సభను వంగవీటి మోహన రంగారావు నిర్వహించారు. ఆనాడు ఆయన విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపునాడు అప్పట్లో ఒక బలమైన సామాజిక వర్గం రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకగా సాగింది. ఆ సభ తరువాతనే వంగవీటి మోహన రంగారావు ఒక పవర్ ఫుల్ శక్తిగా మారారు. ఆయన కేవలం విజయవాడకి పరిమితం అయిన ఎమ్మెల్యేగా కాకుండా ఏపీ రాజకీయాలకే కేంద్ర బిందువుగా మారారు. రంగా రాజకీయ సామాజిక ప్రస్థానం అలా సాగుతూండగానే 1988 డిసెంబర్ 26న విజయవాడలో దారుణ హత్యకు గురి అయ్యారు. ఆ తరువాత కాపునాడు వేదిక నుంచి చాలా మంది పెద్దలు సారధ్యం వహించి తమ సామాజిక వర్గంలో చైతన్యం రగిలించారు. ఇదిలా ఉంటే విశాఖలో ఇపుడు రంగా నాడు పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. దాంతో దీని మీదనే ఇపుడు అంతటా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అభిమానంతోనే :
ఈ సభను రంగా అభిమానులు అంతా కలసి నిర్వహిస్తున్నారు. రంగా వర్ధంతి వేళ జరిగే ఈ సభకు రాజకీయాలకు అతీతంగా ప్రముఖులను అందరినీ ఆహ్వానిస్తున్నారు. విశాఖ బీచ్ లో ఆ రోజున లక్ష మందికి తక్కువ కాకుండా భారీ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ సభ పట్ల ఆసక్తి అయితే విశాఖ జిల్లాతో పాటు కోస్తా తీరం అంతటా అధికంగా ఉంది. ఈ సభలో ఏమి మాట్లాడుతారు, ఏ రకమైన తీర్మానాలు చేస్తారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయంగా ఉంది.
ఆశయాల సాధన కోసమే :
వంగవీటి రంగా తన జీవిత పర్యంతం బడుగులు పేదల కోసం తపించారు. దాంతో ఆయన ఆశయాల సాధన కోసమే తాము కట్టుబడి ఉన్నామని రంగా అభిమానులు తరచూ చెబుతూ ఉంటారు. రంగా జయంతి అయిన జూలై 4న అలాగే ఆయన వర్ధంతి అయిన డిసేంబర్ 26న పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం అన్నది అభిమానులు ఎంతో ఉత్సాహంగా చేసే కార్యక్రమం. ఈ సందర్భంగా విగ్రహాలు ఆవిష్కరించడం, ఆయనకు నివాళి అర్పించడం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి విశాఖను వేదికగా చేసుకుని భారీ ఎత్తున సభను అది కూడా లక్షలాది మందితో నిర్వహించడం అంటే అది రాజకీయంగా సామాజిక పరంగా కూడా ఉత్కంఠను పెంచే విషయంగా ఉంది.
ప్రకంపనలు ఉంటాయా :
అయితే విశాఖ సాగర ఘోషతో పోటీ పడుతూ లక్షలాది మందితో నిర్వహించే రంగానాడు సభలో రాజకీయ ప్రకంపనలు ఉంటాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే ఏపీలో చూస్తే అతి పెద్ద సామాజికవర్గంగా కాపులు ఉన్నారు. వారిది దశాబ్దాలుగా తీరని కోరికగా ఉంది. అదే రాజ్యాధికారం. న్యాయంగా చూస్తే వారి కోరిక ఏనాడో తీరాలి. కానీ అనేక పరిస్థితులు పరిణామాల నేపధ్యంలో అది ఎప్పటికప్పుడు సాకారం కావడం లేదు. దాంతోనే అసంతృప్తి అన్నది వారికి ఉంది. మరో వైపు చూస్తే రంగా వంటి నాయకుడి ఆశయాలు నెరవేర్చాల్సి ఉందని వాటి కోసం ఎప్పటికపుడు యువతరానికి కూడా చైతన్యం కలిగించాలన్నది ఉంది. మరి ఈ సభ ద్వారా వక్తలు ఏ రకమైన సందేశం ఇస్తారు, ఏ విధమైన సంకేతాలు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విశాఖ వేదికగా జరిగే రంగా నాడు మీదనే అందరి చూపూ ఉందన్నది వాస్తవం.