దేశంలోనే అతిపెద్ద అద్దాల వంతెన.. ఎక్కడో తెలుసా?
ప్రకృతి సోయగాల నగరం, పర్యాటక ఆకర్షణల కేంద్రం.. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మరో ప్రత్యేక గుర్తింపు సాధించింది;
ప్రకృతి సోయగాల నగరం, పర్యాటక ఆకర్షణల కేంద్రం.. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మరో ప్రత్యేక గుర్తింపు సాధించింది. పర్యాటకంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న విశాఖలో ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద అద్దాల వంతనె ఏర్పాటవుతోంది. ఈ నెలలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న అతిపెద్ద అద్దాల వంతెనపై సాగర తీరంతోపాటు విశాఖ అందాలను వీక్షించే సౌకర్యాన్ని కల్పిస్తోంది వీఎంఆర్డీఏ. వాస్తవానికి గత నెలలోనే ఈ అద్దాల వంతెనను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నెలలో ముహూర్తం పెట్టాలని భావిస్తున్నారు. సముద్ర తీరంలో కైలాసగిరి పర్వతంపైన ఏర్పాటు చేసిన ఈ అద్దెల వంతెన సాహసవంతులకు సాదర స్వాగతం పలుకుతోంది.
గాలిలో తేలిపోవాలనుకునే వారికి కైలాగగిరిపై ఏర్పాటు చేసిన స్కై బ్రిడ్జి రమ్మని పిలుస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ అద్దాల బ్రిడ్జి.. విశాఖ పర్యాటక శోభను మరింత ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నారు. పీపీపీ విధానంలో సుమారు రూ.6 కోట్ల రూపాయలతో ఈ అద్దాల వంతెనను నిర్మించారు. సుమారు 50 మీటర్ల పొడవు ఉన్న కాంటిలివర్ గాజు వంతెనపై నుంచి స్కై వాక్ చేస్తూ టైటానిక్ వ్యూ పాయింట్ వరకు వెళ్లి సముద్ర తీరంలో అందాలను అస్వాదించవచ్చునని చెబుతున్నారు.
త్వరలో ప్రారంభం కాబోతున్న కైలాసగిరి కాంటిలివర్ గాజు వంతెన దేశంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా గాజు వంతెన కేరళలో ఉంది. విశాఖలో 50 మీటర్ల వంతెన ప్రారంభమైతే దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. మధురానుభూతి కలిగించే ఈ అద్దాల వంతెన ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. కేంటి లివర్ విధానంలో కింద ఎటువంటి ఆధారం లేకుండా ఈ వంతెన నిర్మించారు.
సముద్రపు గాలికి తుప్పు పట్టని స్టీల్ ను గాజు వంతెన నిర్మాణానికి వినియోగించారు. ఈ స్టీల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోగా, అద్దాలు, రోప్ లు బెంగళూరులో తయారు చేయించారు. వంద మంది పర్యాటకులు ఒకేసారి వెళ్లినా తట్టుకోగల సామర్థ్యంతో గాజు వంతెన తయారైంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న వంతెనను ఈ నెలలో మంచి ముహూర్తం చూసి ప్రారంభించనున్నారు. సాహసం చేయాలనే అభిరుచి ఉన్నవారికి ఈ వంతెన పై స్కై వాక్ చేయడం చిరకాలంగా గుర్తుండిపోతుందని అంటున్నారు.