ఐటీలో విశాఖ టాప్ గేర్.. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ రాకతో జెట్ స్పీడు

ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధమవడంతో ప్రభుత్వం ఊహించినదాని కన్నా ముందే విశాఖ ఐటీ హబ్ వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు;

Update: 2025-12-04 17:30 GMT

క్లౌడ్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీకి విశాఖపట్నం నూతన గమ్యస్థానంగా మారుతోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధమవడంతో ప్రభుత్వం ఊహించినదాని కన్నా ముందే విశాఖ ఐటీ హబ్ వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ఇదే సమయంలో విశాఖలో కొత్త కార్యాలయాల ప్రారంభానికి టీసీఎస్, కాగ్నిజెంట్ రెడీ అవుతున్నాయి. ఈ నెల 12నే కాగ్నిజెంట్ కార్యాలయం ప్రారంభం కానుండటంతో విశాఖ ఐటీ రంగంలో కీలక పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు.

విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఏర్పాటు చేయబోతున్న వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు రాష్ట్ర టెక్ రంగానికి గేమ్ ఛేంజరుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. అమెరికా వెలుపల ఆ సంస్థ పెట్టుబడుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖ పరిసరాల్లో మూడు చోట్ల 400 ఎకరాల భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదేసమయంలో ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

విశాఖ గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని అంటున్నారు. ఇలాంటి పెద్ద డేటా హబ్‌ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోని ప్రముఖ టెక్‌ హబ్‌ల స్థాయికి తీసుకెళ్లగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకవైపు, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ విశాఖలో తన అధికారిక సేవలు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కాగ్నిజెంట్ కోసం ఐటీ సెజ్ లోని కాపులుప్పాడలో 22 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ శాశ్వత క్యాంపస్‌ కోసం ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. ఇక అదే రోజు రుషికొండ ఐటీ హిల్‌–2లో ఖాళీగా ఉన్న మహతి భవనంలో 800 మందితో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభమవుతోంది. సుమారు రూ.1580 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి మొత్తం 8 వేల ఉద్యోగాలు కల్పించేలా కాగ్నిజెంట్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఉత్సాహం చూపుతుండటంతో ముందుగానే కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది.

మరోవైపు దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కూడా విశాఖలో శాశ్వత భవనాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. హిల్‌–3లో 21.76 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ భవనాలు నిర్మించేలోగా ఐటీ హిల్స్ లో మిలీనియం టవర్స్‌లో తాత్కాలిక కార్యాలయం ప్రారంభించాలని టీసీఎస్ నిర్ణయించింది. ఇప్పటికే భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చుకుంది. మొదటి దశలో 1500 నుంచి 2000 వేల మంది ఉద్యోగులు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా టీసీఎస్ ప్రారంభం తేదీ ఇంకా వెల్లడించలేదు. గత నెలలో ప్రారంభిస్తారని అనుకున్నా, ఏదో అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ, జనవరిలోగా విశాఖలో టీసీఎస్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ మూడు ప్రధాన ఐటీ సంస్థల రాకతో విశాఖపట్నం మళ్లీ టెక్నాలజీ హబ్‌గా తిరిగి పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. డేటా సెంటర్ల నుండి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ సేవల వరకు విస్తృత రంగాల్లో పెట్టుబడులు రావడంతో రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెద్దఎత్తున పెరిగే అవకాశముంది. ఇప్పటికే చోటు చేసుకున్న అభివృద్ధిని చూసి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు మరింతగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News