'పొలిటీషియన్, జర్నలిస్ట్, పోలీసుని పెళ్లి చేసుకోవడం దురదృష్టం'!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయనేదీ తెలిసిన విషయమే.;

Update: 2026-01-20 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయనేదీ తెలిసిన విషయమే. ఏ అంశంపై అయినా పేర్ని నాని తన దైన శైలిలో విశ్లేషణ, వివరణ ఇవ్వడంలో దిట్ట అని అంటారు. అటు సామాన్యుడికి, ఇటు మేధావులకు సైతం అర్ధమయ్యే రీతిలో అరటి పండు వలచి నోట్లో పెట్టినట్లుగా అతని వివరణలు, విశ్లేషణలు ఉంటాయని చెబుతారు. స్పష్టత కొరవడకుండా ఆయన ప్రెస్ మీట్లు ఉంటాయని చెబుతారు.

ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపైనా.. సమకాలిన రాజకీయ అంశాలపైనా పేర్ని నాని వివరణ స్పష్టతతో కూడుకున్నట్లుగా ఉంటాయని అంటారు. ప్రెస్ మీట్ల సంగతి అలా ఉంటే.. ఇక పార్టీ సభల్లో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉంటాయి. గతంలో ఓ సారి... తన లాంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. మొన్న మంత్రిగా ఉన్న తాను నేడు సాధారణ ఎమ్మెల్యేని అని చెబుతూ... నాయకుల కోసం కాదు, జగన్ కోసం జెండా మోసే కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని పేర్ని స్పష్టం చేశారు!

నాడు ఆ ప్రసంగం నెట్టింట వైరల్ గా మారింది. తన లాంటి వాళ్లో, మిగిలిన నాయకుల వంటి వారో వస్తుంటారు.. పోతుంటారని.. పార్టీలు మారే నాయకులు పార్టీకి ముఖ్యం కాదని.. వారిని, వారి నడవడికను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని.. జగన్ కు జెండా మోసే కార్యకర్తకు మధ్య నాయకులు అవసరం లేదని.. జగన్ కోసం జెండా మోసే కార్యకర్తలే పార్టీకి బలమని అప్పట్లో నానీ చెప్పుకొచ్చారు! కాకపోతే ఆ విషయాన్ని జగన్ విస్మరించారనే చర్చ నాడు జరిగింది! ఆ సంగతి అలా ఉంటే... పొలిటీషియన్స్, జర్నలిస్టులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన వెల్లడించారు.

అవును... రాజకీయ నాయకుడు, విలేకరి పిల్లను ఇచ్చినంత పాపం ఇంకొకటి లేదని పేర్ని నాని అన్నారు. రాజకీయ నాయకుడు, విలేకరి, పోలీసులను వివాహం చేసుకునే మహిళలు ఎప్పుడో పాపం చేసుకుంటేనే వీళ్లను వివాహం చేసుకుంటారని పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వారూ వీరూ అనే తారతమ్యాలు లేవని.. ఎవరి ఇంట్లో పరిస్థితి అయినా ఈ విధంగానే ఉంటుందని.. తన భార్య పరిస్థితీ అంతే అన్నట్లుగా పేర్ని నాని తెలిపారు!

భార్య భువనేశ్వరి ఊర్లో ఉండి ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన వెళ్లిపోతారని.. రాత్రి 7 గంటలు దాటితే వైఎస్ జగన్ అయినా ఇంటికి వెళ్లిపోతారని చెప్పిన పేర్ని నాని.. అందరూ ఇళ్లకు వెళ్తారు కానీ.. క్వాలిటీ సమయం కుటుంబానికి కేటాయించలేరు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా చాలా మంది పొలిటీషియన్స్, పోలీసులు, జర్నలిస్టులు వారి వారి అనుభవాలను నెమరువేసుకుంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News