బెజవాడలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్స్ లో పసి ప్రాణాల్ని వదిలేసింది
సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి.. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.;
విజయవాడలో అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. ముక్కపచ్చలారని పసికందును పబ్లిక్ టాయిలెట్స్ వద్ద వదిలేసి వెళ్లిన మహాతల్లి పాషాణ మనసు తీరు షాకింగ్ గా మారింది. పసిపిల్లను ఎత్తుకొని ఆటో ఎక్కిన ఒక మహిళ.. క్రిష్ణలంక స్టేషన్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్ వద్ద ఆటోను ఆపేసింది. బాత్రూంకు వెళ్లాలని చెప్పిన సదరు మహిళ.. ఆ పసికందును టాయిలెట్ వద్ద వదిలేసి.. అడ్డుగా ఒక బకెట్ పెట్టి.. తన దారిన తాను వెళ్లిపోయింది.
టాయిలెట్ ను శుభ్రం చేసేందుకు వచ్చిన శానిటేషన్ సిబ్బంది పసికందును చూసి ఒక్కసారి షాక్ తిన్నారు. ముక్కపచ్చలారని చిన్నారిని అలా వదిలేసి వెళ్లిపోతారా? అన్న షాక్ కు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి.. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆటోలో ఆ మహిళ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద దిగినట్లుగా గుర్తించారు. ఆ మహిళఎవరు? ఎక్కడ పసికందును ప్రసవించింది? ఎందుకు వదిలేసి వెళ్లిపోయింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమైనా.. పసికందును అంత కర్కశంగా వదిలేసిన మహాతల్లి తీరును పలువురు తప్పు పడుతున్నారు.