వైసీపీకి యాంటీ సెంటిమెంట్ గా మారిందా ?

వైసీపీ ఇప్పటికి వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రెండు ఓడి ఒకటి గెలిచింది.;

Update: 2025-06-03 03:15 GMT

వైసీపీ ఇప్పటికి వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి రెండు ఓడి ఒకటి గెలిచింది. అయితే వైసీపీ ఇప్పటిదాకా గెలవని నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. వాటిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ సీట్లు కూడా ఉన్నాయి.

సరే ఓటమి మాట పక్కన పెడితే ఒక సీటు విషయంలో బాగా యాంటీ సెంటిమెంట్ ఉందని అంటున్నారు. మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలియదు కానీ గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే అక్కడ పోటీ చేసిన వారు తరువాత కాలంలో ఏకంగా రాజకీయాలకే గుడ్ బై కొట్టేస్తున్నారు. దాంతో ఆ సీటు అంటే వైసీపీలోనూ బయట రాజకీయ వర్గాలలోనూ చర్చగానే ఉంది.

ఇంతకీ ఆ సీటు ఏమిటి అంటే విజయవాడ ఎంపీ సీటు. విజయవాడ అంటేనే రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. అలాంటి చోట ఎంపీ సీటు అంటే ఎవరైనా కళ్ళకు అద్దుకుని పోటీకి దిగుతారు. కానీ గడచిన మూడు పర్యాయాలూ అక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన వారు అంతా ఓటమి పాలు కావడం విశేషం కాకపోయినా వరుసగా రాజకీయాల నుంచి కనుమరుగు కావడమే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉందిట.

విజయవాడ ఎంపీ సీటుకు 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 5 లక్షల 17 వేల 834 ఓట్లు వచ్చాయి. బాగానే ఆయన ఓట్లు తెచ్చుకున్నారు. 74,862 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని మీద ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వీడారు. ఏకంగా రాజకీయాన్ని వీడారు.

ఇక 2019 ఎన్నికల్లో చూస్తే కనుక వైసీపీ నుంచి పోటీ చేసిన వారు ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్, ఆయన కూడా 566,772 ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన మీద టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని నాని కేవలం 8,726 ఓట్ల తేడాతోనే గెలిచారు. అంతలా ఢీ కొట్టి ఓడి గెలిచిన వారుగా ఉన్న పొట్లూరి తదనంతర కాలంలో రాజకీయాల నుంచే మెల్లగా తప్పుకున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానే వైసీపీ నుంచి పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో నానికి 5,12,069 ఓట్లు వచ్చాయి. ఏకంగా 2,82,085 ఓట్ల భారీ తేడాతో తన సోదరుడు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఈ మూడు ఉదాహరణలనూ చూసిన తరువాత చాలా మంది విజయవాడ సీట్లో గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే రాజకీయంగా కూడా దూరం కావడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయించడానికి వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ ని సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. అయితే విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని చూస్తున్న అవినాష్ విజయవాడ ఎంపీ సీటు అంటే వద్దు అనే అంటున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఈ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు పోటీకి దిగుతారో అన్నది చర్చగా ఉందిట.

Tags:    

Similar News