గవర్నర్ ఎట్ హోం - వైసీపీ కీలక నేతకు లోకేష్ వెల్ కం
ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో ఎట్ హోం పేరుతో తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. దానికి గవర్నర్ నిర్వహిస్తారు.;
ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో ఎట్ హోం పేరుతో తేనీటి విందు కార్యక్రమం ఉంటుంది. దానికి గవర్నర్ నిర్వహిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఎంతో మంది ప్రముఖులను లోక్ భవన్ కార్యాలయం ఎట్ హోం కోసం ఆహ్వానిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేకుండా అంతా కలిసి మెలసి లోక్ భవన్ లో రాజ్యాంగ పరిరక్షకుల సమక్షంలో జరుపుకునే కార్యక్రమంగా ఇది ఉంటుంది. ఈసారి కూడా విజయవాడ లోక్ భవన్ లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం జరిగింది.
ఆహ్లాదకరంగా :
ఇదిలా ఉంటే ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలోని లోక్ భవన్ లాన్స్‌లో తేనీటి విందును సుహృద్భావ వాతావరణంలో నిర్వహించారు. ఎట్ హోం కి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయన సతీమణి గుడియా ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజ్నెవా హాజరయ్యారు. అదే విధంగా ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి జకియా ఖానం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు అంతా హాజరయ్యారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, మహిళా సర్పంచ్‌లు, మెరిట్ విద్యార్థులు, ఎన్జీఓల ప్రతినిధులు వంటి ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో ఉన్నారు.
వైసీపీ నుంచి ఆయన :
అయితే ఎట్ హోం కార్యక్రమానికి విపక్షం వైసీపీ నుంచి అయితే పెద్దగా ఎవరూ రాలేదు, వైసీపీ విపక్షంలో ఉంది. అయితే శాసనమండలిలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. దాంతో ఆయన ఎట్ హోం కి హాజరయ్యారు. ఆయనను మంత్రి నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అయితే 2014 నుంచి 2019 మధ్యలో విపక్షంలో ఉన్నపుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లో రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కి ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. ఇక గడచిన రెండేళ్ళుగా విజయవాడ వేదికగా జరుగుతున్న ఎట్ హోం కి వైసీపీ హాజరు కావడం లేదు, గత సారి హాజరైన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈసారి ఎందుకో రాలేదని అంటున్నారు. బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్ సహా ఇతర నేతలు హాజరయ్యారు. మొత్తానికి అధికార పక్షం కూటమికి చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో సందడితో ఎట్ హోం పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిపోయింది.
లోకేష్ సందడి :
ఎట్ హోం లో మంత్రి నారా లోకేష్ సందడి ఎక్కువగా కనిపించింది. ఆయన అతిధులు అందరి వద్దకు వెళ్ళి ప్రత్యేకంగా వారిని పలకరించడం కనిపించింది. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుతో లోకేష్ సరదాగా సంభాషిస్తూ కొంత సేపు గడిపారు. దాంతో లోకేష్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించారు.