ఆత్మాహుతి చేసుకుంటా.. ఎమ్మెల్యే జోక్యంపై మద్యం వ్యాపారి సెల్ఫీ వీడియో

విజయవాడ నగరంలో చాలా బార్లకు ఇప్పటికీ దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.;

Update: 2025-09-18 10:15 GMT

విజయవాడలో బార్ లైసెన్సుల జారీ ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ కొత్త విధానం వల్ల ఇప్పటికీ బార్ల కోసం పెద్దగా ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదని అంటున్నారు. అయితే తాను దరఖాస్తు చేసుకుందామన్నా అధికారులు సహకరించడం లేదని, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వల్ల తన దరఖాస్తును అధికారులు తీసుకోవడం లేదని ఓ మద్యం వ్యాపారి వీడియో విడుదల చేశాడు. అంతేకాకుండా తన దరఖాస్తు తీసుకోకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించడంతో కలకలం రేగింది.

విజయవాడ నగరంలో చాలా బార్లకు ఇప్పటికీ దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బార్ కోసం ఓ మద్యం వ్యాపారి నాలుగు డీడీలు తీసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లగా ఆయనను అనుమతించడం లేదని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా, ఎమ్మెల్యే ఉమ, ఎక్సైజ్ అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తనకు గతంలో బార్ లైసెస్సు ఉందని, కొత్తగా మళ్లీ లైసెన్సు కోసం భార్య నగలు తాకట్టు పెట్టి రూ.23 లక్షలతో నాలుగు దరఖాస్తులు సమర్పిస్తే ఎక్సైజ్ అధికారులు తీసుకోవడం లేదని ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. చేతిలో డీడీలు పట్టుకుని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఆయన వీడియో తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. మద్యం వ్యాపారం చేసుకునే తన కుటుంబాన్ని, తన వద్ద పనిచేసిన వారిని పోషించుకుంటున్నట్లు ఆయన ఆ వీడియోలో తెలిపాడు. ఎమ్మెల్యే బొండా ఉమా వల్ల తన దరఖాస్తు తీసుకోవడం లేదని ఆ వీడియోలో ఆరోపించాడు.

ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వ అధికారులే పాటించకపోతే ఎలా? ఎమ్మెల్యే, అధికారులు కలిసి తనను వ్యాపారం చేసుకోనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆక్రోశించాడు. భార్య నగలు తాకట్టు పెట్టి దరఖాస్తు చేసుకుంటే తీసుకోరా? దరఖాస్తు తీసుకోడానికి సమయం ఇంకా ఉన్నా అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. నా దరఖాస్తు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. పెట్రోల్ కూడా తీసుకువచ్చానని ఆయన ఆ వీడియోలో హెచ్చరించాడు.

Tags:    

Similar News