విజయసాయిరెడ్డిలో సడన్ ఛేంజ్.. హిందు మతం కోసం ఇంట్రెస్టింగ్ ట్వీట్

దేశంలో అత్యధికుల మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయరెడ్డి అభిప్రాయపడ్డారు.;

Update: 2025-12-07 19:09 GMT

దేశంలో అత్యధికుల మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వి.విజయసాయరెడ్డి అభిప్రాయపడ్డారు. మతమార్పిడులపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోను తన ఎక్స్ లో షేర్ చేసిన విజయసాయిరెడ్డి.. ఆ యూట్యూబర్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు కామెంట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరుతున్నారు. హిందూ మతాలపై కుట్రలు జరుగుతున్నాయని, అటువంటి కుట్రలను సహించేది లేదని కూడా విజయసాయి తన ట్వీట్ లో స్పష్టం చేశారు. మత మార్పిడులకు ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన బుద్ది చెప్పి గుణపాఠం నేర్పాలని విజయసాయి పిలుపునిచ్చారు.

హిందూ మతానికి చెందిన వారిని డబ్బు ఆశ చూపి మరో మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులు లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి .. అదే భారతదేశానికి రక్ష ... శ్రీరామ రక్ష’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తన ట్వీట్ కు మతమార్పిడులను ఖండిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో లింక్ ను జత చేశారు. ఇక విజయసాయిరెడ్డి ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయసాయిరెడ్డి తన అధికారిక ‘ఎక్స్’లో ట్వీట్ చేయగా, కొద్ది సమయంలోనే వైరల్ అయింది. ఆయన ట్వీట్ పై చాలా మంది ప్రతిస్పందిస్తున్నారు. ఆయన పనిచేసిన వైసీపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మత మార్పిడులు జరిగాయని కొందరు కామెంట్స్ చేస్తుండగా, రెండు దశాబ్దాలు అంటే ‘ముందు మన మహామేత కుటుంబసభ్యుల దగ్గర నుండి మొదలు పెడదామా కాపు రెడ్డి గారూ’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘మాకు డబ్బులు ఇచ్చారు అందుకే మేము మతం మారాము అనే వాళ్ళని ఒక్కళ్ళని చూపించు.’ అంటూ మరికొందరు విజయసాయిరెడ్డి పోస్టును ఖండిస్తున్నారు.

మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ పై ఎక్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. మరోవైపు దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో రాజకీయం చేసిన విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనట్లు మతాలను ప్రస్తావిస్తూ పోస్టు చేయడంపై పొలిటికల్ సర్కిల్స్ లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి.. మళ్లీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? అని అనుమానిస్తున్నారు. ప్రధానంగా తనపై ఉన్న కేసుల నుంచి రక్షణకు ఆయన బీజేపీకి దగ్గరయ్యే పనిలో ఉన్నారని, అందుకే హిందుత్వకు మద్దతుగా మాటలు మొదలు పెట్టారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ సెలవు రోజైన ఆదివారం రాజకీయ సెగలు పుట్టించిందనే చెబుతున్నారు.



Tags:    

Similar News