పోస్టర్స్ కలకలం.. టీవీకే విజయ్ పోటీ చేసే స్థానం ఇదేనా?

తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారనే చర్చ జరుగుతోందని అంటున్నారు.;

Update: 2025-05-24 04:04 GMT

తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారనే చర్చ జరుగుతోందని అంటున్నారు. అటు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేలతో పాటు ఈ సారి తమిళనాట ఆసక్తికర త్రిముఖ పోటీని విజయ్ "టీవీకే" పార్టీ కన్ఫాం చేసింది! ఈ సమయంలో విజయ్ పోటీ చేసే నియోజకవర్గంపై ఓ పోస్టర్ కలకలం రేపింది!

అవును... రాబోయే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న తమిళగ వెట్రి కజగం అధినేత పోటీ చేసే స్థానంపై ఓ ఆసక్తికర చర్చకు తేరలేచింది. ఇందులో భాగంగా... టీవీకే అధినేత విజయ్.. మధురై వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆ పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తోందని తెలుస్తోంది. ఈ విషయం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోందని అంటున్నారు.

ఈ సమయంలో.. మదురై వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ ఓ వాల్ పోస్టర్ అతికించబడింది. ఇక్కడ నుంచి విజయ్ పోటీ చేస్తే.. 1.10 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపడతారని ఆ పోస్టర్ లో ముద్రించి ఉంది. కాగా.. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 3 లక్షలు కావడం గమనార్హం.

ఇలా.. టీవీకే అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై దృష్టి సారించడంపై రెండు అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ఈ మదురై వెస్ట్, అన్నాడీఎంకే కంచుకోటగా ఉంది. 2007 ఉప ఎన్నిక మినహా 2001 నుంచి జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఇక్కడ అన్నాడీఎంకేనే గెలిచింది. మాజీ మంత్రి సెల్లూర్ రాజు ఇక్కడి నుంచే 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు.

దీంతో... టీవీకే విజయ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుంటే గెలుపు కత్తిమీద సాము అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. గతం సంగతి కాసేపు పక్కనపెడితే ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో మధురై నియోజకవర్గంలో అన్నాడీఎంకే పరపతి తగ్గిందని, మూడో స్థానానికి పరిమితమైందని మరికొందరు గుర్తు చేస్తున్నారు.

అందువల్ల వచ్చే ఎన్నికల్లో విజయ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే కలిసి వస్తుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో... మదురై వెస్ట్ లో విజయ్ పోటీ అంటూ వెలిసిన పోస్టర్లు ప్రధానంగా అన్నాడీఎంకే నేతల్లో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఎలాగూ డీఎంకేకు ఈ స్థానం సింహస్వప్నంగా ఉన్న సంగతి తెలిసిందే అని చెబుతున్నారు. మరి విజయ్ నిర్ణయం ఏమిటనేది వేచి చూడాలి.

Tags:    

Similar News