తమిళ రాజకీయాల్లో భారీ సంచలనం.. దళపతి విజయ్ సెన్సేషన్
2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ తాను మధురై నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.;
తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కీలక ప్రకటన చేశారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న దళపతి విజయ్ తాను మధురై నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు అక్కడ నిర్వహించిన బహిరంగ సభ తమిళ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. లక్షల మంది అభిమానులు తరలిరావడతో మధురైలో టీవీకే సభ విజయవంతంమైనట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అధికార డీఎంకే పార్టీకి టీవీకే మధ్యే జరగనుందని ఆ పార్టీ అధిపతి విజయ్ ప్రకటించారు. దక్షిణ భారత్ లో అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన హీరోగా విజయ్ కు గుర్తింపు ఉంది. ఇక గత కొన్నేళ్లుగా తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ్.. గత ఏడాది సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళనాడులోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు సమదూరం పాటిస్తూ తానే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని విజయ్ వ్యూహం రచిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు దిగుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం మధురైలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా లక్షల మంది జనం హాజరయ్యారు. ఎటు చూసినా అభిమానుల సందడితో సభా ప్రాంతం ఒక జన సముద్రాన్ని తలపించిందని చెబుతున్నారు. ఈ అభిమాన జనం ఓట్ల రూపం తీసుకుంటే విజయ్ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించడం ఖాయమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సభకు వచ్చిన జనాన్ని చూసి విజయ్ కూడా ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు.
ఇక సభలో విజయ్ మాట్లాడుతూ, తమిళనాడులో అధికార డీఎంకే తన రాజకీయ విరోధిగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని భావజాల శత్రువుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి తలుపు తట్టి వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను ఎంతగా విమర్శిస్తే, అంతగా ఎదుగుతానని ప్రత్యర్థులను హెచ్చరించారు.
తమిళనాడులో ప్రధాన నగరమైన మధురై నుంచి తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించిన విజయ్.. మధురై ఈస్ట్ నుంచి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కుల, మతాల తనకు ముఖ్యం కాదని, తమిళుడికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ముందు మనం ఎందుకు తల వంచాలని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో మహిళలకు రక్షణ లేకపోయిందని ధ్వజమెత్తారు. కాగా, 2024లో టీవీకేను స్థాపించగా, తొలి బహిరంగ సభ గత ఏడాది విల్లుపురంలో నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సభతో విజయ్ సరికొత్త రికార్డు నెలకొల్పారని అంటున్నారు.