విజయ్ '40-40' ఫార్ములా.. అదిరిపోయేలా టీవీకే కొత్త వ్యూహం!
40 ఏళ్ల యువతలో 60 శాతం ఓట్లు కైవసం చేసుకుంటే మొత్తం ఓట్లలో 24 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లేనని భావిస్తున్న విజయ్, మిగిలిన 16 శాతం ఓట్ల కోసం మహిళలు, కూలీలపై ఫోకస్ చేశారు.;
తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, గెలుపు కోసం పార్టీలు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఎన్నికల రణరంగంలోకి దిగిన దళపతి విజయ్ విజయం కోసం పక్కా స్కెచ్ వేస్తున్నట్లు చెబుతున్నారు. సంప్రదాయ పార్టీలకు తలదన్నేలా టెక్నాలజీతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోందని అంటున్నారు.
రెండేళ్ల క్రితం పార్టీని ప్రారంభించి, 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ 40 - 40 ఫార్ములాను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. 40 శాతం ఓట్లు సాధిస్తే తమిళనాట గెలుపు సాధ్యమేనన్న భావిస్తున్న విజయ్ 40 ఏళ్లలోపు యువతను ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళిక రచించారని అంటున్నారు. అందుకే తన మ్యానిఫెస్టోలో ఎక్కువగా యువతను ఆకర్షించే పథకాలకు ప్రాధాన్యమిచ్చారని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో 40 ఏళ్లలోపు ఉన్న యువతలో ఎక్కువ మంది విజయ్ ఫ్యాన్స్ గా ఉన్నారని అంటున్నారు. వీరంతా ఏకపక్షంగా తనకు ఓట్లు వేస్తారని విజయ్ అంచనా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో 40 ఏళ్లలోపు వయసున్న యువతలో 60 శాతం మందిని ఆకట్టుకోవడమే విజయ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఓటర్లు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఓటర్లలో 24 శాతం ఉంటారని లెక్కిస్తున్నారు. యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న దళపతి 40 ఏళ్ల యువత ఓట్లను గరిష్టంగా కైవసం చేసుకుంటానని ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. ఇక 40-40 ఫార్మలాలో 40 శాతం ఓట్లు తెచ్చుకోవాలంటే యువత, కూలీల ఓట్లను కొల్లగొట్టాలే ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
40 ఏళ్ల యువతలో 60 శాతం ఓట్లు కైవసం చేసుకుంటే మొత్తం ఓట్లలో 24 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లేనని భావిస్తున్న విజయ్, మిగిలిన 16 శాతం ఓట్ల కోసం మహిళలు, కూలీలపై ఫోకస్ చేశారు. ఈ రెండు వర్గాల్లో సైతం దళపతి పట్ల మోజు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు లెక్క వేసుకుంటున్నాయి. మహిళల ఓట్లలో 8 శాతం, కూలీల ఓట్లలో 8 శాతం తమ పార్టీకి వస్తే ఎవరి సహాయం లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించవచ్చని విజయ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తమిళనాడులో ప్రస్తుతం మూడు పార్టీల కూటముల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధానంగా 16 పార్టీలతో కూటమి కట్టిన డీఎంకే ఒకవైపు, బీజేపీతోపాటు మరికొన్ని తమిళ పార్టీల మద్దతుతో రంగంలోకి దిగిన అన్నాడీఎంకే కూటమికి దీటుగా టీవీకే కూడా గట్టి పోటీ ఇస్తోందని చెబుతున్నారు. దీంతో ఎవరి ఓట్లు చీలిపోతాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందని డీఎంకే కలలు కంటుండగా, టీవీకే వల్ల తమకు మేలు జరుగుతుందని అన్నాడీఎంకే లెక్కలు వేసుకుంటోంది. ఇక రెండు సంప్రదాయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని, తమ పార్టీకి ఎవరూ ఊహించని తీర్పు నిస్తారని విజయ్ పార్టీ నమ్మకంగా చెబుతోంది. తమ 40-40 ఫార్ములా కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పుకుంటోంది.