ఆస్ట్రేలియాలో భారీ చోరీ కేసు: రూ.90 కోట్ల సూపర్‌మార్కెట్ దోపిడీ గ్యాంగ్‌లో భారతీయుడు అరెస్ట్

ఈ ఘటన ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజంలో చర్చనీయాంశమైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు ఇలాంటి నేరాలకు పాల్పడటం వల్ల..;

Update: 2026-04-20 07:00 GMT

ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా విక్టోరియా రాష్ట్రంలోని పలు సూపర్‌మార్కెట్లను వణికిస్తున్న ఒక భారీ రిటైల్ దొంగతనాల ముఠాను పోలీసులు ఛేదించారు. సుమారు రూ. 90 కోట్ల (10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) విలువైన వస్తువులను దొంగిలించిన ఈ ముఠాలో ఒక 39 ఏళ్ల భారతీయుడు ఉండటం అతనే ఏకంగా రూ. 1.5 కోట్ల విలువైన వస్తువుల చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

వ్యవస్థీకృత నేరం.. ముఠా పనితీరు

విక్టోరియా పోలీసుల కథనం ప్రకారం.. ఇది సాధారణ దొంగతనం కాదు. అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగిన సంఘటిత నేరం. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ ముఠా గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలోని ప్రముఖ రిటైల్ చైన్స్ , సూపర్‌మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. వీరు ప్రధానంగా రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఖరీదైన గృహోపకరణాలు.. ఎలక్ట్రానిక్ వస్తువులు.. కాస్మెటిక్స్ , బ్రాండెడ్ ఉత్పత్తులను దొంగిలించేవారు. దొంగిలించిన వస్తువులను వీరు నేరుగా వినియోగదారులకు కాకుండా బ్లాక్ మార్కెట్‌లో తక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు. మెల్‌బోర్న్, గీలాంగ్, బల్లారత్ వంటి ప్రధాన నగరాల్లోని దాదాపు అన్ని పెద్ద రిటైల్ స్టోర్లలో వీరు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు.

పట్టుబడ్డ భారతీయుడు.. 68 కేసులు!

ఈ కేసులో అరెస్టయిన 39 ఏళ్ల భారతీయ వ్యక్తి ఉదంతం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. దర్యాప్తులో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు ఎటువంటి చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా ఆస్ట్రేలియాలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిపై ఏకంగా 68 దొంగతనం కేసులు, మరో 19 దొంగతన ప్రయత్న కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ వ్యక్తి ఒక్కడే సుమారు 1.6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ. 1.5 కోట్లు) విలువైన వస్తువులను దొంగిలించినట్లు ఆధారాలు లభించాయి.

పోలీసులు ఇతని కదలికలను సుదీర్ఘకాలం పాటు నిశితంగా గమనించి.. సాంకేతిక ఆధారాలతో పక్కాగా పట్టుకున్నారు. నిందితుడి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, ఇతను ముఠాలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

విచారణ.. కోర్టు తీర్పులు

ఈ భారీ కుంభకోణంపై విక్టోరియా పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. ఇప్పటి వరకు ఈ ముఠాకు సంబంధించి 18 మంది నిందితులు కోర్టులో దోషులుగా తేలారు.. వారికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. 10 మంది ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నేరగాళ్లు పట్టుబడకుండా ఉండేందుకు తరచుగా తమ నివాసాలను మార్చుతూ పోలీసుల కళ్లుగప్పే ప్రయత్నం చేసినప్పటికీ సిసిటివి ఫుటేజ్, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ సహాయంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రవాసులపై ప్రభావం

ఈ ఘటన ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజంలో చర్చనీయాంశమైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు ఇలాంటి నేరాలకు పాల్పడటం వల్ల.. చట్టబద్ధంగా నివసిస్తున్న ఇతర వలసదారులపై కూడా నిఘా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "చట్టవిరుద్ధంగా నివసిస్తూ నేరాలకు పాల్పడే వారిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి ఘటనలు వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడానికి దారితీస్తాయి" అని వలస నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ గౌరవప్రదమైన జీవనం సాగించాలని, ఇలాంటి పెడధోరణులు మొత్తం దేశ ప్రతిష్టను మసకబారుస్తాయని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. విక్టోరియా పోలీసులు ఈ కేసును ఒక ఉదాహరణగా తీసుకుని రిటైల్ రంగంలో దొంగతనాల నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నారు.

Tags:    

Similar News