మహా పాపం.. ప్రసాదం కల్తీపై వెంకయ్యనాయుడి సంచలన కామెంట్స్

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన లడ్డూ ప్రసాదం కల్తీపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సంచలన కామెంట్స్ చేశారు.;

Update: 2026-02-21 11:54 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన లడ్డూ ప్రసాదం కల్తీపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సంచలన కామెంట్స్ చేశారు. ఈ విషయంలో లోతుగా మాట్లాడనంటూనే.. ‘‘దైవ ప్రసాదంలో కూడా 'కల్తీ' జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏం కలిపారు.. ఆ వివరాల్లోకి నేను వెళ్లడం లేదు. భగవంతుడు విషయంలో అంతకన్నా 'పాపం' ఏముంటుంది?’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని పీబీ సిద్ధార్ణ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై మాట్లాడిన ఆయన లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

భగవంతుడి విషయంలో పాపం చేశారంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ఏ పార్టీని ఉద్దేశిస్తూ ఈ విమర్శలు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ చేశారంటూ ఏపీలో అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్న విషయం తెలిసిందే. తప్పు మీదంటే మీదంటూ ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న విషయంపై అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న నొక్కి చెబుతూ వెంకయ్య చేసిన వ్యాఖ్యలు నేతలను ఉలిక్కిపడేలా చేశాయని అంటున్నారు.

గత ప్రభుత్వంలో బోలేబాబా డెయిరీకి టెండర్లు ఖరారు చేసి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడేలా చేశారని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై గత కొన్ని నెలలుగా తీవ్ర వివాదమే కొనసాగుతోంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలు అన్నీ తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన విపక్ష వైసీపీ కొద్దిరోజుల క్రితం ఈ వివాదంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్’ను లాగి మలుపు తిప్పింది. దీంతో ఇరుపార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఉప రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయని అంటున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని వెంకయ్య స్పష్టం చేశారు. ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తరచూ స్పందిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎక్కువగా కూటమి సర్కారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా లడ్డూ ప్రసాదంపై వెంకయ్య చేసిన వ్యాఖ్యలు అంతుచిక్కడం లేదని అంటున్నారు. లడ్డూ కల్తీ జరిగింది అన్న ఏకైక విషయం చెప్పడంతోపాటు మహాపాపం చేశారని వెంకయ్య వ్యాఖ్యానించారు. దీంతో రెండు పార్టీల వారు ఎవరికి వారు వెంకయ్య మాటలను అన్వయించుకుంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News