మండలి వైస్ చైర్మన్ వైసీపీకే.. !
ఏపీ శాసన మండలిలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చక్రం తిప్పాలని అనుకున్నా.. అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.
ఏపీ శాసన మండలిలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చక్రం తిప్పాలని అనుకున్నా.. అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. మొత్తం 58 మంది సభ్యుల్లో వైసీపీకి 33 మంది సభ్యులు ఉన్నారు. ఇప్ప టికే మరో ఐదుగురు బయటకు వచ్చినా.. ఈ సంఖ్యా బలం విషయంలో వైసీపీ తన హవాను కొనసాగిస్తోం ది. దీంతో ప్రస్తుతం ఖాళీ అయిన.. వైస్ చైర్మన్ పదవి మరోసారి వైసీపీకే దక్కనుంది. దీనికి సంబందించి జగన్ కసరత్తు కూడా పూర్తి చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటి మాధవరావును ఎంపిక చేస్తూ.. ఆయన వైస్ చైర్మన్‌గా నియమించాలని మండలి చైర్మన్.. మోషేన్ రాజుకు జగన్ లేఖరాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మండలిలోకి అడుగు పెట్టిన తూమాటి సీనియర్ నాయకుడు. ఆయన వల్ల.. పార్టీ ఇమేజ్ పెరుగుతుందన్న భావన ఉంది. అంతేకాదు.. ఇటు పార్టీకి, అటు జగన్‌కు కూడా తూమాటి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఫలితంగా వైస్ చైర్మన్ కోసం ఎంతో మంది పోటీలో ఉన్నా.. తూమాటికే జగన్ పెద్దపీట వేశారు.
ఇదిలావుంటే.. ఈ దఫా వైస్ చైర్మన్ పదవి కోసం.. వైసీపీలో కొందరు నేతలు ప్రయత్నించారు. వీరిలో మహిళలు కూడా ఉ న్నారు. గతంలో మైనారిటీ మహిళగా ఉన్న నంద్యాల జిల్లాకు చెందిన జకియాఖానం కు జగన్ అవకాశం ఇచ్చినా.. ఆమె 2024 తర్వాత.. పార్టీ మారిపోయారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. తాజాగా సోమవారంతో ఆమె ఆరేళ్ల పదవీ కాలం పూర్తయింది. అయితే.. ఈ క్రమంలోనే తమకు అవకాశం దక్కుతుందని ఎస్సీ, బీసీ మహిళలు ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు.
ఇక, టీడీపీ కూడా వైస్ చైర్మన్ పదవి కోసం తొలుత తీవ్రంగానే శ్రమించింది. కానీ.. వైసీపీలో ఎలాంటి చీలికా రాలేదు. పైగా.. బలమూ తగ్గలేదు. దీంతో బలాబలాల ఆధారంగానే.. మండలిలో వైస్ చైర్మన్ పదవి వైసీపీకి దక్కనుంది. ఇదిలావుంటే.. తాజాగా ఖాళీ అయిన.. రెండు గవర్నర్ కోటా సీట్లు కూడా.. ఇంకా భర్తీ కావాల్సి ఉంది. వీటి విషయంపై చంద్రబాబు ఇంకా తేల్చలేదు. మరోవైపు.. నాయకులు మాత్రం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే.. వైసీపీనే మండలిలో బలంగా ఉండడంతో దీనిని ఎదుర్కొనే రీతిలో బలమైన నాయకులను రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.