భువనమ్మ.. రాజకీయం స్టార్ట్ చేస్తే లెక్క వేరే..!
రాజకీయాల్లో రావాలి.. మేడం అంటూ అక్కడి మహిళలు.. భువనేశ్వరిని కోరుతున్నారు. కుప్పంతో చంద్రబాబు 45 ఏళ్ల అనుబంధం ఉంది.
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆమె కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే.. ఎంత మెజారిటీ వస్తుంది? ఇదేదో పనీ పాటా లేని వారు అంటున్న మాటలు కాదు. కుప్పం నియోజకవర్గంలో మహిళలు.. నేరుగా భువనేశ్వరి ముందే చెబుతున్న మాట. రాజకీయాల్లో రావాలి.. మేడం అంటూ అక్కడి మహిళలు.. భువనేశ్వరిని కోరుతున్నారు. కుప్పంతో చంద్రబాబు 45 ఏళ్ల అనుబంధం ఉంది.
అయితే.. గత పదేళ్లుగా ఈ నియోజకవర్గంతో నారా భువనేశ్వరి కూడా అనుబంధం పెంచుకున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో చంద్రబాబు ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇక్కడి మహిళలకు ఉపాధి చూపించారు. కొన్ని మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు విజయ యాత్ర పేరుతో నారా భువనేశ్వరి కుప్పంలో పాదయాత్ర కూడా చేశారు.
చంద్రబాబును గెలిపించాలని ఆమె ఆ సమయంలో ఇంటింటికీ తిరిగారు. ఆ తర్వాత.. ప్రభుత్వం ఏర్పడ్డాక.. నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇలా.. తరచుగా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ.. కూడా స్థానికంగా ఉన్న మహిళలను ఆకర్షించాయి. తాజాగా నాలుగు రోజుల పర్యటన కోసం కుప్పం వెళ్లిన సమయంలో భువనేశ్వరికి.. ఇక్కడి మహిళలు రాజకీయాల్లోకి రావాలంటూ.. సూచించారు. కుప్పంలో తిరుగులేని మెజారిటీతో గెలిపించుకుంటామని కూడా చెప్పారు.
అయితే.. సహజంగానే సునిశిత మనస్కురాలైన భువనేశ్వరి.. తనకు, రాజకీయాలకు సరిపోదని సునిశి తంగానే వారి ప్రతిపాదనను తిరస్కరించారు. తనకు రాజకీయాలపై ఇంట్రస్టు లేదని చెప్పారు. అయితే.. మహిళల కోసం.. కుప్పం నియోకవర్గం అభివృద్ధి కోసం.. తాను నిలబడతానన్నారు. ఇప్పటికే తన కుటుంబం నుంచి ఇద్దరు నాయకులు ఉన్నారని.. ఇప్పుడు తనకు రాజకీయాలు చేసే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. కానీ, భువనేశ్వరి కనుక .. ఊ అంటే.. ఇక్కడి మహిళలే ఆమెకు అండగా ఉండి.. ఇంటింటికీ తిరిగి గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండడం గమనార్హం.