అయ్యో పాపం.. రూ.100 కోట్లు సంపాదించేది కేవలం 576 మందేనా?

అయితే ఈ గణాంకాలు చూసి "అబ్బే దేశంలో 576 మందేనా కోటీశ్వరులు?" అని నవ్వకండి. అది కేవలం ఒక సంవత్సరంలో అధికారికంగా వచ్చిన 'ఆదాయం' మాత్రమే.

Update: 2026-07-29 13:10 GMT

అయ్యో ఎంత ఘోరం.. 140 కోట్ల జనాభా ఉన్న మన మహా భారతదేశంలో ఏడాదికి రూ.100 కోట్లు పొందే ‘పాప రహితులు’ కేవలం 576 మంది మాత్రమేనట.. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో కన్నీరు మున్నీరుగా ఆవేదన చెందుతూ వెల్లడించింది.

అవును మై డియర్ మధ్యతరగతి మిత్రమా.. మన దేశంలో ఐదేళ్ల క్రితం 2021-22 ఏటా రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పేద ముక్కుపచ్చలారని శ్రీమంతులు కేవలం 142 మంది మాత్రమే ఉండేవారు. కానీ ఐదేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 300 శాతానికి పైగా పెరిగి 576కి చేరింది. అసెస్మెంట్ ఇయర్ 2024-25లో 415గా ఉన్న ఈ సంఖ్య, ఒక్క ఏడాదిలోనే 576కి పెరిగిందంటే.. దేశంలో ‘అతి పేదవాళ్లు’ ఎంత వేగంగా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 2021-22లో కేవలం 142 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. మధ్యలో 2022-23లో 301, 2023-24లో 284 మంది నమోదైనా ఆ తర్వాత మళ్లీ భారీ పెరుగుదల కనిపించింది. మొత్తంగా ఐదేళ్లలో ఈ వర్గం సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం విశేషం. 2025-26లో 576 మంది.. ఐదేళ్లలో 300%+ వృద్ధి చెందడం విశేషం.

కారణాలేమిటి? స్టార్టప్‌లా? ఈక్విటీలా? లేక ఇన్ కమ్ టాక్స్ శాఖ కళ్లజోడా?

అసలు వీళ్ల ఆదాయం ఎందుకు పెరిగిందయ్యా అంటే.. స్టార్టప్‌లు, ఐటీ, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ అట.. అయితే ఆర్థిక విశ్లేషకులు అసలు రహస్యం వేరే చెప్తున్నారు. మన ఐటీ శాఖ వారి డిజిటల్ నెట్‌వర్క్, నిఘా ఎంత గట్టిగా తయారయ్యాయంటే.. గతంలో ‘కంటికి కనిపించకుండా’ తిరిగిన లక్ష్మీదేవిని ఇప్పుడు గొలుసులతో పట్టుకుని మరీ లెక్కల్లోకి రాస్తున్నారు. పాపం దాచుకోవడం చేతకాక చాలామంది ఆదాయాలు ఇప్పుడు ఐటి రిటర్న్స్ లో వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు మనం రూ.100 కేజీ టమోటాలు కొనాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. ఇంకోవైపు 576 మంది ఏడాదికి రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఏకంగా విమానాలు, ఐలాండ్స్ కొనాలో వద్దో డిసైడ్ చేసుకుంటున్నారు.

రూ.100 కోట్లు అంటే ఆదాయం మాత్రమే గురూ.. సంపద కాదు..

అయితే ఈ గణాంకాలు చూసి "అబ్బే దేశంలో 576 మందేనా కోటీశ్వరులు?" అని నవ్వకండి. అది కేవలం ఒక సంవత్సరంలో అధికారికంగా వచ్చిన 'ఆదాయం' మాత్రమే. అసలు వాళ్ల ఆస్తులు, నికర సంపద ఎంత ఉందో లెక్కించే సమగ్ర వ్యవస్థ ఇంకా మన దేశంలో లేదట. అంటే రోడ్డు మీద కోటి రూపాయల కారులో తిరిగే సగటు వ్యాపారి ఆదాయం పేపర్‌ మీద బహుశా నెలకు రూ.50 వేలు ఉండొచ్చు.. అది వేరే విషయం అనుకోండి..

సమతుల్యత.. అసమానత.. మన బడ్జెట్ కథ

ఒకపక్క ఈ 576 మంది తమ ఆదాయాలను ఆకాశానికి తీసుకెళ్తుంటే మరోపక్క సగటు మధ్యతరగతి జీవి ప్రతి నెలా జీతం రాగానే ఈఎంఐలు, పన్నుల భారాన్ని మోస్తూ "ఈ సారికి గట్టెక్కితే చాలు" అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని సంతోషించాలా లేక దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే మగ్గిపోతోందని దిగులుపడాలో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.

ఏది ఏమైనా భవిష్యత్తులో టాక్స్ సిస్టమ్ ఇంకా పారదర్శకంగా మారి, నికర సంపద లెక్కలు కూడా బయటకు వస్తే.. మన పక్కింటి అంకుల్ నిజమైన నెట్ వర్త్ కూడా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News