వంగ‌వీటికి ప‌ద‌వి రెడీ.. తీసుకుంటారా ..!

వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004 ఎన్నికల్లో విజయం సాధించి వన్ టైం ఎమ్మెల్యేగా నిలిచిపోయారు.;

Update: 2025-08-16 03:45 GMT

వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004 ఎన్నికల్లో విజయం సాధించి వన్ టైం ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీలు మారడం, పోటీ చేసిన చోట పరాజయం పొందడం వంటివి అందరికీ తెలిసిందే. తండ్రి ఇమేజ్ను పూర్తిగా దక్కించుకోలేకపోయిన వారసుల్లో ఈయన ముందు వరుసలో ఉంటారు. వాస్తవానికి తండ్రి వారసత్వంతో వచ్చిన చాలామంది నాయకులు తర్వాత కాలంలో విజయం దక్కించుకున్నారు. అదేవిధంగా ప్రజల్లోనూ మంచి పేరును సొంతం చేసుకున్నారు. రాధా విషయానికి వస్తే ఈ రెండు కనిపించడం లేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. పాల్గొనక పోయినా టిడిపి నాయకుడిగా ఆయన ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించారు. కానీ, అప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి రావడంతో ఆయన ఆ ప్రతిపాదనను కూడా విరమించుకున్నారు. ఇక అప్పటినుంచి రాజ్యసభకు పంపిస్తారని, లేదా శాసన మండలి పంపిస్తారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. అయితే ఈ వ్యవహారంపై టిడిపి కానీ అటు రాధాకృష్ణ కానీ ఎక్కడ స్పందించలేదు.

వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న నాయకులు పదవులు కోరుకోవడం తప్పుకాదు. పదవుల్లో ఉండాలని అనుచరులు సైతం కోరుకుంటారు. ఈ వ్యవహారం రాధా విషయంలో ప‌నిచేయ‌డం లేదు. గతంలో వైసిపి రాజ్యసభ పంపిస్తాం అన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు. తనకు సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కావాలని పట్టుబడ్డారు. దీంతో ఆ పార్టీ ఆయనను పక్కన పెట్టింది. ఆ తర్వాత టిడిపిలోకి వచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఏ పదవి లేకుండానే దాదాపు 15 సంవత్సరాలుగా రాధా రాజకీయం కొనసాగిపోతుంది.

అయితే, రంగాను అభిమానించే కాపు నాయకుల్లో రాధా పట్ల అభిమానం మెండుగానే ఉంది. ఈ నేపథ్యంలో టిడిపిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి పదవులు లేకపోవడం పట్ల వారంతా ఆవేదనతోనే ఉన్నారు. దీంతో తరచుగా రాధా వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన టిడిపి అధినేత సీఎం చంద్రబాబు వంగవీటి రాధాకు పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పదవిని అప్పగించే అంశంపై పరిశీలన చేస్తున్నట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

ఇది రాష్ట్ర స్థాయి పదవే అయినా.. నామినేటెడ్ పదవి కావడంతో పాటు కేవలం రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉండడంతో ఏ మేరకు ఈ పదవిని రాధా తీసుకుంటారు?. చంద్రబాబు నిర్ణయాన్ని ఏ మేరకు గౌరవిస్తారు అనేది చూడాలి. ఇక పదవి విషయానికి వస్తే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడును తప్పించి ఆ పదవిని వంగవీటి కి అప్పగిస్తారని, తద్వారా కాపు నాయకుల్లో టిడిపి ప్రభావాన్ని తగ్గకుండా చూసుకుంటారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడికి కాపు కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. వాస్తవా నికి రెండేళ్ల తర్వాత ఆయనను కూడా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆయనను ముందుగానే ఆ పదవి నుంచి తప్పించి వేరే పదవిని ఇవ్వాలని ఆ పోస్టును వంగవీటి రాధాకు ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని టిడిపి సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి రాధా దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News