వల్లభనేని వంశీకి బెయిలు.. అయినా మళ్లీ జైలు తప్పదా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిలు లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు అయిన విషయం తెలిసిందే.;
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిలు లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. సుమారు నాలుగు నెలలుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి అన్ని కేసుల్లోనూ బెయిలు లభించింది. దీంతో ఈ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అక్రమ మైనింగు కేసులో హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కేసును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జైలు నుంచి వంశీ విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాదనలు నెగ్గి సుప్రీం కోర్టు బెయిలు రద్దు చేస్తే మాత్రం ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఫిర్యాదుదారు సత్యవర్థన్ తో రాజీకి వంశీ ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకునేలా చేశారని బాధితుడు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వంశీని కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్ లోని ఆయన సొంత ప్లాట్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆయనను రిమాండుకు తరలించగా, ఒకదాని తర్వాత ఒకటి చొప్పున సుమారు 8 కేసులు నమోదు చేశారు.
పోలీసులు వరుస పీటీ వారెంట్లు జారీ చేయడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు నాలుగు నెలలు జైలుకే పరిమితం కావాల్సివచ్చింది. ఈ సమయంలో ఆయన పలుమార్లు అనారోగ్యం పాలయ్యారు. జైలుకు వెళ్లిన తర్వాత వంశీ రూపంలోనూ చాలా మార్పు వచ్చింది. అనారోగ్యం కారణంగా ఆయన బాగా బక్క చిక్కిపోయినట్లు కనిపిస్తున్నారు. బరువు కూడా చాలా తగ్గిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వంశీ పరుష వ్యాఖ్యలు చేయడంతో ఆయన టీడీపీ, జనసేన కార్యకర్తలకు టార్గెట్ గా మారిపోయారు.
కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వంశీ అరెస్టు ఖాయమన్న ప్రచారం జరిగినా, దాదాపు 8 నెలలు పాటు ప్రభుత్వ పెద్దలు వేచిచూశారు. కనీసం ఓ ఏడాది అయినా ఆయనను జైలులో పెట్టేలా పకడ్బందీగా వ్యూహరచన చేసి అమలు చేశారని అంటున్నారు. అయితే అక్రమ మైనింగు కేసులో హైకోర్టు బెయిలు ఇవ్వడంతో వల్లభనేని వంశీ నాలుగు నెలలకే బయటకు వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో వల్లభనేని విడుదల అవుతారా? లేదా? అన్న ఉత్కంఠ రేపింది. అయితే హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయని సుప్రీంకోర్టు కేసును వాయిదా వేయడంతో బుధవారం వంశీ జైలు నుంచి బయటకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది.